Arvind Kejriwal Challenges BJP: ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ దాడి కేసు అక్కడి రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తన సహాయకుడు బిభవ్ కుమార్‌పై కుట్ర చేసి అరెస్ట్ చేయించారంటూ అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా మండి పడ్డారు. ఇదంతా బీజేపీ కుట్ర అని ఆరోపించారు. బీజేపీ పదేపదే ఆప్‌ని వెంటాడుతోందని అసహనం వ్యక్తం చేశారు. ఏం చేసినా తమ పార్టీని అణిచివేయలేరని తేల్చి చెప్పారు. ఇప్పటికే సంజయ్ సింగ్‌ని జైల్‌లో పెట్టిన బీజేపీ ఇప్పుడు బిభవ్ కుమార్‌పై కక్ష కట్టిందని మండి పడ్డారు. ఈ క్రమంలోనే ఆయన సవాల్ విసిరారు. బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌కి అంతా కలిసి వస్తామని, ఎంత మందిని అరెస్ట్ చేస్తారో చూస్తానంటూ ఛాలెంచ్ చేశారు. Jail Bharo కార్యక్రమానికి పిలునిచ్చారు. రేపు (మే 19న) మధ్యాహ్నం 12 గంటలకు అంతా కలిసి బీజేపీ ఆఫీస్‌కి వెళ్తామని స్పష్టం చేశారు.
"బీజేపీ ఆప్ వెంట ఎలా పడుతోందో గమనిస్తూనే ఉన్నారు. ప్రధాని మోదీ మాతో జైల్ కా ఖేల్ ఆడుతున్నారు. అందుకే రేపు బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌కి మా పార్టీలోని కీలక నేతలతో కలిసి వస్తాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ వస్తారు. మీరు ఎంత మందిని అరెస్ట్ చేస్తారో, ఎంత మందిని జైలుకి పంపుతారో చూస్తాం"
- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి
వరుస అరెస్ట్‌లు తప్పవేమో: కేజ్రీవాల్
బిభవ్ కుమార్ అరెస్ట్‌పైనా స్పందించారు కేజ్రీవాల్. ఇప్పటికే సంజయ్ సింగ్‌ని జైలుకి పంపిన బీజేపీ ఆ తరవాత రాఘవ్ చద్దాని అరెస్ట్ చేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఆయన లండన్ నుంచి రాగానే అరెస్ట్ చేసే అవకాశముందని అన్నారు. తరవాత అతిషితో పాటు సౌరభ్ భరద్వాజ్‌ని కూడా జైలుకి పంపుతారని మండి పడ్డారు. తాము ఏం నేరం చేశామని బీజేపీ ఇలా అరెస్ట్‌లు చేయిస్తోందో చెప్పాలని ప్రశ్నించారు.
"బీజేపీ మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేసిందో అర్థం కావడం లేదు. ఎందుకు అరెస్ట్ చేస్తుందో తెలియడం లేదు. మేం చేసిన తప్పేంటి..? ప్రభుత్వ ఆసుపత్రులను, బడుల్ని బాగు చేయించనందుకా ఇదంతా. వాళ్లు ఈ మాత్రం అభివృద్ధి కూడా చేయలేకపోతున్నారు. 24 గంటల పాటు విద్యుత్ అందిస్తున్నాం. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పని చేయలేదు"
- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి