Cockroch in Vande Bharat Express Food: మరోసారి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ముఖ్యాంశాల్లో నిలిచింది. గతంలో కూడా చాలా సార్లు ఈ రైలులో వడ్డించిన భోజనం వాసన రావడం, బొద్దింకలు, ఇతర కీటకాలు రావడంపై రైల్వే శాఖ ప్రయాణికుల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. తాజాగా మరోసారి ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. వాస్తవానికి సాధారణ రైళ్లతో పోలిస్తే వందే భారత్ రైళ్ల స్పీడ్ ఎక్కువ. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ సెమీహైస్పీడ్ వందే భారత్ సర్వీసును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ రైలు టికెట్ ధర కాస్త ఎక్కువ అయినా చాలా మంది దీనిలోనే ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు. తొందరగా తమ గమ్యస్థానాలకు చేరుకోవడమే కాకుండా ప్రయాణం సౌకర్యంగా ఉండడమే ఇందుకు కారణం. కానీ, వందే భారత్ రైళ్లలోని భోజన సదుపాయాలపై తరచూ ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా వందేభారత్‌లో ప్రయాణించిన దంపతులకు చేదు అనుభవం ఎదురైంది.
సోషల్ మీడియాలో పోస్ట్
జూన్ 18న భోపాల్ నుంచి ఆగ్రాకు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న దంపతులకు ఆహారంలో బొద్దింక కనిపించింది. ఈ ఆహారాన్ని రైలులో ఐఆర్‌సీటీసీ (IRCTC) అందించింది. వడ్డించిన ఆహారంలో చనిపోయిన బొద్దింక ఉన్న చిత్రాన్ని ట్విటర్ యూజర్ విదిత్ వర్షిణే షేర్ చేశారు. తన అత్త మేనమాలకు రైలులో ప్రయాణిస్తుండగా ఈ సంఘటన ఎదురైందని ఆయన పేర్కొన్నారు. భోజన సౌకర్యాన్ని అందించిన సదరు వ్యాపారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విదిత్ వర్షిణే అధికారులను డిమాండ్ చేశారు. ఐఆర్‌సీటీసీ అతడి పోస్ట్ కు స్పందించి కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. సర్వీస్ ప్రొవైడర్లకు తగిన జరిమానా విధిస్తున్నట్లు పేర్కొంది.
క్షమాపణలు చెప్పిన ఐఆర్‌సీటీసీ
‘‘మా అత్తమామ భోపాల్ నుంచి ఆగ్రాకు వందేభారత్ రైల్లో ప్రయాణించారు. రైల్వే సిబ్బంది ఇచ్చిన భోజనంలో వడ్డించిన పప్పులో బొద్దింక రావడంతో వారు షాక్‌కి గురయ్యారు. ప్రయాణికుల ఆరోగ్య సమస్యలపై రైల్వేశాఖ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. క్యాటరింగ్ యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలి’’ అని విదిత్ వర్షిణే ‘ట్విట్టర్’ వేదికగా రైల్వే శాఖకు ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు ట్యాగ్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ట్విట్టర్లో పోస్ట్ చేసిన రెండ్రోజుల తర్వాత ఐఆర్‌సీటీసీ అధికారిక హ్యాండిల్ స్పందించింది. 'సర్, ప్రయాణంలో మీకు ఎదురైన అనుభవానికి మేము క్షమాపణలు కోరుతున్నాం. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. సంబంధిత సర్వీస్ ప్రొవైడర్‌కు తగిన జరిమానా విధించాం. ఉత్పత్తి, లాజిస్టిక్స్ పర్యవేక్షణను కూడా ముమ్మరం చేశాం..’ అంటూ చెప్పుకొచ్చింది ఐఆర్‌సీటీసీ.
ఘటనపై నెటిజన్ల స్పందన
"ఆహారం తయారు చేసే పరిస్థితిని ప్రయాణికులు ఇకపై ఎప్పుడూ ఆర్డర్ చేయరు వీలైతే ఇంట్లో వండిన భోజనాన్ని తీసుకుని వెళ్లడానికే నేను ఇష్టపడతాను" అని నితీష్ కుమార్ అనే నెటజన్ కామెంట్ చేశారు. ఇక పై నేను రైల్వే ఫుడ్ తినను. మీ ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని మీతో తీసుకెళ్లండని అని మరో నెటిజన్ ఫిరోజ్ అహ్మద్ కామెంట్ చేశారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే రైల్వే వివరాలు మాత్రమే అడుగుతుందని తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మరో నెటిజన్ కామెంట్ చేశారు.