మహారాష్ట్ర సంగ్లీలో పోలీసులు, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వచ్చిన సీఎం ఉద్ధవ్ ఠాక్రే కాన్వాయ్ ను సంగ్లీ హార్బత్ రోడ్డు వద్ద భాజపా కార్యకర్తలు, ట్రేడర్లు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ముఖ్యమంత్రి పర్యటన..
సంగ్లీ జిల్లాలోని భిల్వాడి, అంకాల్ ఖాప్, కస్బే-దిగ్ రాజ్ సహా వివిధ ప్రాంతాల్లో సీఎం ఉద్ధవ్ ఠాక్రే పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితిని ఆయన గమనించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటామని ఉద్ధవ్ ఠాక్రే హామీ ఇచ్చారు. ఆహారం, బట్టలు, మందులు సహా పునరావాసాన్ని కల్పిస్తామన్నారు. ప్రజలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
వరదలు..
మహారాష్ట్రలోని కుంభవృష్టి వానలు కల్లోలం సృష్టించాయి. గత 40 ఏళ్లలో ఎన్నడూ ఎరుగని రీతిలో ఊళ్లకు ఊళ్లను ముంచెత్తాయి. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి, వరదల్లో చిక్కుకుని 129 మంది వరకు చనిపోయారు. చనిపోయారు. రోడ్లు ఎక్కడికక్కడ తెగిపోవడం, వరదలు పోటెత్తాయి.
ఇటీవల రాయిగఢ్ జిల్లా మహాద్ తెహ్సిల్‌లోని తలయ్ గ్రామం దగ్గర్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 30కిపైగా ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఎన్టీఆర్ఎఫ్, స్థానిక డిజాస్టర్ మేనేజ్‌మెంట్ టీమ్స్ సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించాయి. వరద, బురద కారణంగా రోడ్లన్నీ మూసుకుపోయాయి. వరదల వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు చేపడతామని సీఎం ఉద్ధవ్ ఠాక్రే హామీ ఇచ్చారు.