Kejriwal On PM Modi:
గ్యాస్ ఛాంబర్ ఢిల్లీ: భాజపా
ఢిల్లీ కాలుష్యం..(Delhi Air Pollution) రాజకీయ వేడినీ పెంచుతోంది. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలనే దాని కంటే...ఎవరికి వాళ్లు పొలిటికల్ గెయిన్ కోసం చూస్తున్నారు. భాజపా, ఆప్ మధ్య ఇదో పెద్ద మాటల యుద్ధానికీ దారి తీసింది. పంజాబ్ రైతులకు కేంద్రం ఎలాంటి సహకారం అందించక పోవటం వల్లే గడ్డి తగల బెడుతున్నారని ఆప్ విమర్శిస్తుంటే...భాజపా లెక్కలతోసహా ఆప్ వైఫల్యాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ ట్విటర్ వేదికగా ఆప్‌ను విమర్శిస్తూ ఓ ట్వీట్ చేశారు. ఆప్ ప్రభుత్వం వచ్చాకే పంజాబ్‌లో గడ్డి తగలబెట్టడం ఎక్కువైందని, కాలుష్యం 19% పెరిగిందని మ్యాప్‌తో సహా పోస్ట్ చేశారు యాదవ్. ఢిల్లీ ఓ గ్యాస్ ఛాంబర్‌లా మారిపోయిందనటంలో ఎలాంటి సందేహం లేదని ట్వీట్ చేశారు. ఒక్కరోజులోనే పంజాబ్‌లో 3,634 ప్రాంతాల్లో రైతులు గడ్డి కాల్చారని వివరించారు. గతేడాదితో పోల్చి చూస్తే...ఇప్పుడే పంజాబ్‌లో ఈ సమస్య తీవ్రమైందనీ ఆరోపించారు. అక్కడితో ఆగలేదు. ఆప్ ప్రభుత్వంపై మరి కొన్ని విమర్శలూ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఐదేళ్లలో పంజాబ్ ప్రభుత్వానికి రూ. 1,347 కోట్లు కేటాయించిందని, ఆ నిధులతో పంట వ్యర్థాలను తగలబెట్టకుండా తొలగించే మెషీన్లు కొనుగోలు చేయాలిన చెప్పినట్టు వివరించారు భూపేంద్ర యాదవ్. పంజాబ్ ప్రభుత్వం 1,20,000 మెషీన్లు కొనుగోలు చేస్తే...అందులో 11,275 యంత్రాలు కనిపించకుండా పోయాయని ఆరోపించారు. రూ.492 కోట్ల రూపాయలతో పంట వ్యర్థాల నిర్వహణ చేయాల్సి ఉండగా...అందులో రూ.280 కోట్లు కేంద్రమే అందజేసిందని వెల్లడించారు. ఇంత పెద్ద మొత్తంలో నిధులు అందించినా...అక్కడి సమస్య తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందని మండి పడ్డారు.
ఆప్ ఎదురుదాడి..
అటు ఆప్ ఎదురుదాడికి దిగింది. ఢిల్లీలో కాలుష్యానికి కేంద్రమే కారణమని కేజ్రీవాల్ ఆరోపించారు. ఉత్తర భారత్ అంతా ఈ సమస్య ఉందని వివరించారు. యూపీ, హరియాణా, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోనూ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ఒకే విధంగా ఉంటోందని వెల్లడించారు. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలు దేశమంతా కాలుష్యాన్ని వ్యాప్తి చేస్తున్నాయా..అని ప్రశ్నించారు కేజ్రీవాల్. ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశంపై తమతో మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేయటం లేదని అడిగారు. పంజాబ్ రైతులకు సరైన విధంగా కేంద్రం సహకారం అందించటం లేదు కాబట్టే వాళ్లు ఉద్యమం చేశారని గుర్తు చేశారు. గడ్డి తగలబెట్టే విషయమై తాము ఓ ప్రపోజల్ పంపించినా...కేంద్రం దాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. ప్రస్తుతం ఢిల్లీలో కాలుష్య స్థాయి అత్యంత ప్రమాదకర స్థితికి చేరుకుంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలుగా ఢిల్లీ, ఎన్‌సీఆర్ ఉన్నాయి. AQI 300కి పైగానే నమోదవుతోంది.