Krishna Last Rites :   మంగళవారం తెల్లవారుజామున కన్నుమూసిన సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు సీఎం సూచించారు. కేసీఆర్ ఆదేశంతో పోలీసుల అధికారిక వందనంతో కృష్ణకు తుది వీడ్కోలు పలకనున్నారు. 



అంతకు ముందు కేసీఆర్ కృష్ణ మృతి వార్త తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. విభిన్న కుటుంబ కథా చిత్రాలతో పాటు, ప్రజలకు సామాజిక స్పృహ కల్పించే సాంఘిక చిత్రాల నటుడిగా కృష్ణ జనాదరణ పొందారని అన్నారు.  నాటి కార్మిక కర్షక లోకం కృష్ణను తమ అభిమాన హీరో గా, సూపర్ స్టార్ గా సొంతం చేసుకున్నారని సీఎం గుర్తు చేసుకున్నారని గుర్తు చేసుకున్నారు. 





టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,  మంత్రి కేటీఆర్ కృష్ణ భౌతిక కాయానికి నానక్ రామ్ గూడలోని నివాసంలో నివాళులు అర్పించారు. 


బుధవారం సాయంత్రం మహాప్రస్థానంలో అంత్యక్రియలు 


కాంటినెంటల్ ఆస్పత్రి నుంచి నానక్‌రామ్ గూడలోని కృష్ణ ఇంటికి భౌతిక కాయాన్ని తరలించారు. మంగళవారం సాయంత్రం వరకూ సినీ ప్రముఖుల సందర్శనార్థం ఉంచుతారు. తర్వాత  గచ్చిబౌలి స్టేడియానికి తరలిస్తారు.  బుధవారం  మధ్యాహ్నం 2 గంటల వరకు  అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు.  అనంతరం అక్కడి నుంచి రేపు ఉదయం పద్మాలయ స్టూడియోస్‌కు తరలిస్తారు. కొన్ని ఆచార కార్యక్రమాలు పూర్తయ్యాక.. మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తి చేయనున్నట్లు కృష్ణ సోదరుడు, నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరి రావు తెలిపారు. 


కృష్ణకు అభిమానుల ఘన నివాళి 


 అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన ఉదయం 4.10 గంటలకు కాంటినెంటల్‌ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కార్డియాక్‌ అరెస్టుతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. కృష్ణ మరణ వార్త ఆయన కుటుంబ సభ్యులు, తెలుగు చిత్ర పరిశ్రమను తీవ్ర విషాదంలోకి నెట్టింది.  సినీ పరిశ్రమ మొత్తం తరలి వచ్చి కృష్ణ పార్దీవ దేహానికి నివాళులు అర్పిస్తోంది. అన్ని చోట్లా నుంచి అభిమానులు.. తమ జ్ఞాపకాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.