Ashok Gehlot:
గహ్లోట్ ఫైర్
ఈ ఏడాది కర్ణాటకతో పాటు రాజస్థాన్‌లోనూ ఎన్నికలు జరగున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్, బీజేపీ నేతల విమర్శల డోసు రోజురోజుకీ పెరుగుతోంది. కాంగ్రెస్ పని అయిపోయిందని బీజేపీ అంటుంటే...మీ పాలనలో అభివృద్ధి ఏది అని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోట్‌పై కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తీవ్ర విమర్శలు చేశారు. అశోక్ గహ్లోట్ రాజకీయాల్లో పది తలలున్న రావణుడి లాంటి వాడని మండి పడ్డారు. రాజస్థాన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై గహ్లోట్ స్పందించారు. బీజేపీ నేతలు పేదల సంక్షేమం గురించి పట్టించుకున్నప్పుడే...అసలైన రాముడి అనుచరులు అని ప్రజలు నమ్ముతారని అన్నారు. ఓ సభలో మాట్లాడిన ఆయన గజేంద్ర షెకావత్‌కు కౌంటర్ ఇచ్చారు.
"ఆ కేంద్రమంత్రి నన్ను రావణుడితో పోల్చారు. రావణ్ రూపి అని విమర్శించారు. నన్ను ఓడించాలనీ పెద్ద పెద్ద మాట్లాడారు. సరే నేను ఇది ఒప్పుకుంటాను. నేను రావణుడినే. కానీ మీరు మర్యాద పురుషోత్తముడు రాముడని అని గట్టిగా చెప్పగలరా..? ముందు ఆ పని చేయండి. పేదల సంక్షేమం గురించి పట్టించుకోండి. అప్పుడు నమ్ముతాం..మీరు రాముడి అనుచరులు అని"
- అశోక్ గహ్లోట్, రాజస్థాన్ సీఎం
బీజేపీ ఎన్ని విమర్శలు చేసినా అభివృద్ధి విషయంలో వెనక్కి తగ్గేదే లేదని తేల్చి చెప్పారు గహ్లోట్. తమ ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందని వెల్లడించారు.
"బీజేపీ నేతలంతా ఒక్కటై నా మీద రాళ్లు విసురుతున్నారు. కానివ్వండి. మీరు రాళ్లు వేయండి. నేను వాటితో పేదలకు ఇళ్లు కట్టిస్తాను. ఇదే మా సిద్ధాంతం. మీకు నిజంగా ధైర్యం ఉంటే..రాళ్లు విసరండి. మేము పేదలకు ఇళ్లు, ఆసుపత్రులు, స్కూళ్లు కట్టి ఇస్తాం. మాటిస్తున్నాను. కచ్చితంగా ఇది చేసి తీరతాం"
- అశోక్ గహ్లోట్, రాజస్థాన్ సీఎం
అంతకు ముందు కేంద్రమంత్రి గజేంద్ర షెకవాత్ గహ్లోట్‌ను రావణుడితో పోల్చారు. గహ్లోట్‌కి రావణుడిలా పది తలలున్నాయని విమర్శించారు.
"రావణుడికి పది తలలుండేవి. ఇదే విధంగా రాజస్థాన్ ముఖ్యమంత్రి గహ్లోట్‌కి కూడా ఉన్నాయి. ఈ ప్రభుత్వం అవనీతిలో కూరుకుపోయింది. రైతుల వ్యతిరేక పాలన నడుస్తోంది. మహిళా హక్కుల్ని తొక్కి పెట్టేస్తున్నారు. ఇదో మాఫియా రాజ్యం, గూండాల రాజ్యం. బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోంది. అంతే కాదు. నిరుద్యోగ రేటులోనూ దూసుకెళ్తోంది. ఇలాంటి రాజకీయ రావణుడిని గద్దె దింపి బీజేపీకి అవకాశమివ్వండి. రామ రాజ్యం కోసం మాకు ఓటేయండి"
- గజేంద్ర షెకావత్, కేంద్రమంత్రి