Tirumala News: కలియుగ వైకుంఠంగా విరాజిల్లుతున్న తిరుమల పుణ్యక్షేత్రంలో నేటి నుండి మూడు రోజుల పాటు నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవం జరగబోతోంది. ఈ పరిణయోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే మూడు రోజుల పాటు జరుగనున్న ఈ వేడుకలో తొలి రోజు శ్రీ మలయప్ప స్వామి వారు గజ వాహనంపై, రెండవరోజు అశ్వ వాహనంపై, చివరి రోజు గరుడ వాహనంపై వేంచేపు చేస్తారు. మరోపక్క ఉభయనాంచారులు ప్రత్యేక పల్లకీలలో పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. ఆ తరువాత కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా ఆలయ అర్చకులు నిర్వహించనున్నారు. టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో పరిణయోత్సవ మండపాన్ని టీటీడీకి చెందిన 30 మంది, తమిళనాడు రాష్ట్రానికి చెందిన 50 మంది అలంకార నిపుణులతో ముస్తాబు చేయించారు. శ్రీనివాస, పద్మావతి పరిణయోత్సవాల‌ మండపాన్నివాళ్లు సర్వాంగ సుందరంగా అలంకరించారు. పూణేకు చెందిన దాత రూ.24 లక్షలతో వేదికను వైభవంగా అలంకరించింది టీటీడీ.


శ్రీ వేంకటాచల మహాత్మ్యం గ్రంథం ఏం చెబుతుందంటే?


పురాణాల ప్రకారం సుమారు ఐదు వేల ఏళ్ల కిందట, అంటే కలియుగం తొలి నాళ్లలో సాక్షాత్తు వైకుంఠం నుండి శ్రీ మహా విష్ణువు శ్రీ వేంకటేశ్వరునిగా భూలోకానికి తరలి వచ్చారు. ఆ సమయంలో నారాయణ వనాన్ని పరిపాలిస్తున్న ఆకాశ రాజు తన కుమార్తె అయిన శ్రీ పద్మావతిని శ్రీ వేంకటేశ్వరుని కిచ్చి వివాహం చేశారు. ఆకాశ రాజు వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం పూర్వ ఫల్గుణి నక్షత్రంలో నారాయణ వనంలో కన్యాదానం చేసినట్లుగా శ్రీ వేంకటాచల మహాత్మ్యం గ్రంథం చెబుతుంది. ఆనాటి పద్మావతీ శ్రీనివాసుల కల్యాణోత్సవ ముహూర్తానికి గుర్తుగా ప్రతీ ఏట వైశాఖ శుద్ధ దశమి నాటికి ముందు ఒక రోజు, తరువాత ఒక రోజు కలిపి మొత్తం మూడు రోజుల పాటు పద్మావతీ పరిణయోత్సవాన్ని టీటీడీ నిర్వహిస్తోంది. అయితే 1992వ సంవత్సరం నుంచి ఈ ఉత్సవాన్ని టీటీడీ ప్రతి ఏటా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆనాటి నారాయణ వనానికి ప్రతీకగా తిరుమల గిరుల్లోని నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీ పద్మావతీ పరిణయ వేడుకలు జరగడం విశేషంమనే చెప్పాలి.


నిన్న హుండీ ఆదాయం ఎంతంటే?


మరోవైపు తిరుమలలో‌ భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. శుక్రవారం రోజున 59,071 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 27,651 మంది తల నీలాలు సమర్పించగా, 4.12 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. అయితే సర్వ దర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 2 కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. దీంతో స్వామి వారి సర్వ దర్శనానికి దాదాపు 12 గంటలకు పైగా సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు 3 గంటల సమయం పడుతుంది. అలాగే శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. శనివారం శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన రోజుగా పిలువ బడుతుంది.