AAP Floor Test: అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అరవింద్ కేజ్రీవాల్ భారీ మద్దతుతో విజయం సాధించారు. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఇటీవలే ఆరోపణలు చేశారు కేజ్రీవాల్. ఈ నేపథ్యంలోనే ఆయన బలపరీక్షకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీ ప్రజల ఓట్లు అడిగే ధైర్యం ఉందా అంటూ ప్రధాని నరేంద్ర మోదీకి సవాల్ విసిరారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ బీజేపీయే విజయం సాధించినప్పటికీ ప్రజలకు ఆ పార్టీ నుంచి విముక్తి కల్పించే బాధ్యతను తమ పార్టీయే తీసుకుంటుందని తేల్చి చెప్పారు. 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి ఈ లక్ష్యాన్ని సాధిస్తామని స్పష్టం చేశారు. బీజేపీకి అతిపెద్ద ముప్పు ఆప్ నుంచే ఉందని తీవ్రంగా విమర్శించారు. అందుకే...అన్ని రకాలుగా తమ పార్టీని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు.
"లోక్‌సభ ఎన్నికల కోసం వెళ్లి ప్రజల్ని ఓట్లు (బీజేపీని ఉద్దేశిస్తూ) అడగండి. ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేయాలని కుట్ర చేశామని చెప్పి ఓట్లు అడిగి చూడండి. ఒకవేళ వాళ్లు ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేయించినా సరే నేను ప్రజల కోసమే పని చేస్తాను. ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచినా సరే వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి బీజేపీ నుంచి ప్రజలకు విముక్తి కలిగించే బాధ్యత మేం తీసుకుంటాం"
- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి
ఆప్ పార్టీని స్థాపించి 12 ఏళ్లు దాటిందని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,350 పార్టీలున్నాయని గుర్తు చేశారు. 2012 నవంబర్ 26వ తేదీన రిజిస్ట్రేషన్‌కి అప్లై చేసినట్టు వివరించారు. ప్రస్తుతం బీజేపీ కాంగ్రెస్ తరవాత మూడో అతి పెద్ద పార్టీగా ఆప్ అవతరించిందని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వానికి తగిన మద్దతు ఉందని తెలిసినా కావాలనే విశ్వాస పరీక్షకు సిద్ధమైనట్టు వెల్లడించారు. బీజేపీ తమ ఎమ్మెల్యేలకు ఎర వేయాలని చూస్తోందని ఆరోపించారు.
"బీజేపీ మా ఎమ్మెల్యేలకు ఎర వేసేందుకు ప్రయత్నించింది. ఏడుగురు ఎమ్మెల్యేలను కొనాలని కుట్ర చేసింది. వీళ్లలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. బీజేపీ మమ్మల్ని సాక్ష్యాలు అడుగుతోంది. మేం ఊరికే టేప్ రికార్డర్‌లు పట్టుకుని తిరుగుతామా..? ఆధారాలు ఎలా చూపించగలం..? నన్ను అరెస్ట్ చేస్తే ఆప్ ప్రభుత్వం కుప్ప కూలిపోతుందని వాళ్లు అనుకుంటున్నారు. నన్ను అరెస్ట్ చేయగలరేమో..కానీ నా విధానాల్ని అడ్డుకోగలరా.."
- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి
Also Read: ముంబయిలో ఘోర అగ్ని ప్రమాదం, కాలి బూడిదైపోయిన ఇళ్లు