Mamata Banerjee Ultimatum: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకపోతే భారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. చాలా వరకూ నిధులు రాకుండా పెండింగ్‌లో ఉంచారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రిపబ్లిక్ వేడుకల్లో ప్రసగించిన సమయంలో ఇలా కేంద్రంపై విరుచుకుపడ్డారు. వారం రోజుల్లోగా పెండింగ్‌లో ఉన్న బిల్స్‌ని చెల్లించకపోతే ఊహించని రీతిలో నిరసనలు చేపడతామని వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం...ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద రూ. 9,330, Mahatma Gandhi National Rural Employment Guarantee Act కింద రావాల్సిన రూ.6,900 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో పాటు నేషనల్ హెల్త్ మిషన్‌కి సంబంధించిన రూ.830 కోట్లు, ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజనలో రూ.770 కోట్లు, స్వచ్ఛ్ భారత్ మిషన్‌లో రూ.350 కోట్లు, మిడ్‌ డే మీల్స్ కింద ఇవ్వాల్సిన రూ.175 కోట్ల మేర చెల్లింపులు అలాగే నిలిచిపోయాయి. వీటితో పాటు మరి కొన్ని పథకాలకూ కేంద్రం నుంచి అందాల్సిన నిధులు రాలేదని బెంగాల్ ప్రభుత్వం మండి పడుతోంది.


గతేడాది నుంచే చర్చలు..


గతేడాది డిసెంబర్ 20వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు మమతా బెనర్జీ. ఆ భేటీలోనే పెండింగ్‌లో ఉన్న బిల్స్ గురించి ప్రస్తావించారు. ఆ సమయంలో ప్రధాని మోదీ అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం అధికారులు సమన్వయంతో ఈ సమస్యని పరిష్కరించాలని చెప్పారు. అయితే...ఇంకా ఆ సమస్య పరిష్కారమైనట్టుగా కనిపించడం లేదు. అందుకే మరోసారి అల్టిమేటం ఇచ్చారు దీదీ. ఈ ఏడాది జనవరిలోనూ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఢిల్లీకి వెళ్లారు. సమస్య గురించి వివరించారు. చెల్లింపుల్లో ఆలస్యాన్ని గుర్తించాలని చెప్పారు. అంతకు ముందు నవంబర్‌లో కొంత మంది తృణమూల్‌ ఎమ్మెల్యేలు కేంద్ర వైఖరికి వ్యతిరేకంగా రాష్ట్రంలో కొన్ని చోట్ల నిరసనలు వ్యక్తం చేశారు. కేంద్రం వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.