- చిత్తూరు తహసీల్దార్ పై చర్యలు తీసుకున్న ఎన్నికల సంఘం
- చర్యలు తీసుకోవాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ ను ఆదేశించిన ఎన్నికల కమిషన్
- ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ప్రతిపక్షాల డిమాండ్ 


Chittoor MRO Parvathi shall not be involve in biennial Election of MLCs: చిత్తూరు మండల తహసీల్దార్ బి.పార్వతిపై రాష్ట్ర ఎన్నికల అధికారికి చిత్తూరు వాసి రంగారావు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ జరిపిన ఏపీ ఎన్నికల కమిషన్ తహసీల్దార్ పార్వతీపై చర్యలు తీసుకోవాలంటూ చిత్తూరు జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది. చిత్తూరు ఎమ్మార్వో బి.పార్వతి భర్త రెడ్డప్ప విశ్రాంత ఏఎస్ఐ, ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పదవిలో ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక శాసనసభ్యులకు చాలా చనువుగా ఉన్నట్లు సమాచారం. 


త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న క్రమంలో చిత్తూరు తాసిల్దార్ అధికార పార్టీకి మద్దతు ఇవ్వాలని, వారికి కావాల్సిన వివరాలను తెలియజేయాలని తన సిబ్బందికి ఆదేశించినట్లు సమాచారం. అంతేకాకుండా తహశీల్దార్ చిత్తూరు స్థానికురాలు, సీసీఏ రూల్స్ ప్రకారం అధికారులకు వారి సొంత ఊరిలో పదవులు ఇవ్వకూడదని చట్టాలు చెబుతున్నా, స్థానిక పోస్టింగ్ కోసం జిల్లా యంత్రాంగంపై రాజకీయంగా ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడంతో మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అమల్లోకి వచ్చింది. అధికార పార్టీ వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని సిబ్బందిపై ఒత్తిళ్లు తేవడంతో, దాంతో పాటు భర్త అధికార పార్టీలో ఉండడంతో ఎన్నికల్లో ఒత్తిళ్లు తెచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఎమ్మార్వో పార్వతీ స్థానంలో మరో అధికారిని నియమించాలని ఫిర్యాదులో పొందుపరిచినట్లు తెలుస్తోంది.


రంగారావు, తహసీల్దార్ భర్త స్థానిక శాసనసభ్యులతో ఉన్న ఫొటోలను జతపరిచి ఫిర్యాదును గవర్నర్, చీఫ్ సెక్రటరీ, ఎన్నికల అధికారుల, జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఈ మెయిల్ ద్వారా సమర్పించినట్లు తెలుస్తోంది. తహశీల్దార్ ను ఎన్నికల విధుల నుండి తొలగించాలని ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు.