China's Communist Party Congress:


పార్టీ రాజ్యాగంలో సవరణలు..


చైనా కమ్యూనిస్ట్ పార్టీ సమావేశం ముగింపు దశకు చేరుకుంది. దాదాపు వారం రోజులుగా జరుగుతున్న కాంగ్రెస్‌లో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ రాజ్యాంగంలో సవరణలు కూడా చేశారు. ఇదంతా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను మూడోసారీ అదే పదవిలో కొనసాగేలా చేసేందుకే. నిజానికి...ఈ వారం రోజుల కాంగ్రెస్ ఉద్దేశం కూడా అదే. జిన్‌పింగ్‌కు మరి కొన్ని అధికారాలు కట్టబెట్టి ఆయననే మూడోసారి
అధ్యక్షుడిగా కొనసాగించేలా తీర్మానం చేస్తారని ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే సెంట్రల్ కమిటీలోని 370 మంది సీనియర్ లీడర్స్ కొన్ని కీలక తీర్మానాలు ప్రవేశపెట్టడంతో పాటు పార్టీ రాజ్యాంగంలోనూ సవరణలు చేశారు. జిన్‌పింగ్‌కి సర్వాధికారాలు కట్టబెట్టే సవరణలు ఇవి. కమ్యూనిస్ట్ పార్టీకి గవర్నింగ్ బాడీగా ఉండే సెంట్రల్ కమిటీ...దేశవ్యాప్తంగా ఎలాంటి విధానాలు అమలు చేయాలో
స్పష్టంగా వివరిస్తుంది. అంతే కాదు. వచ్చే ఐదేళ్లలో ఎలాంటి మార్పులు చేయాలన్నదీ సూచిస్తుంది. ఈ క్రమంలోనే జిన్‌పింగ్‌ను మరోసారి అధ్యక్షుడిగా ఎన్నుకునేలా మార్పులు చేశారు. ఇదే విషయాన్ని ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నారు. 
 
కాంగ్రెస్‌లో నిర్ణయం


ఐదేళ్లకోసారి జరిగే ఈ కాంగ్రెస్‌లో 2,296 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. దేశంలోని అన్ని విభాగాలకు చెందిన వాళ్లు ఇందులో ఉన్నారు. సెంట్రల్ కమిటీ త్వరలోనే సమావేశం కానుంది. పొలిటికల్ బ్యూరోని ఎన్నుకుంటుంది. ఈ బ్యూరో ఏడుగురు సభ్యులతో కూడిన స్టాండింగ్ కమిటీని నియమిస్తుంది. పార్టీ నియమావళి ప్రకారం జనరల్ సెక్రటరీని ఎన్నుకుంటుంది ఈ స్టాండింగ్ కమిటీ. 2012 నుంచి  కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు జిన్‌పింగ్. మరో ఐదేళ్ల పాటు ఆయనే అధ్యక్షుడిగా ఉండేలా స్టాండింగ్ కమిటీ తీర్మానం చేస్తుంది. అంతకు ముందు మావో జెడాంగ్ రెండు సార్లు వరుసగా అధికారంలో ఉన్నారు. ఇప్పుడు జిన్‌పింగ్ ఆ రికార్డుని అధిగమించి మూడోసారి కూడా అధికార పగ్గాలు చేపట్టబోతున్నారు. అంతే కాదు. జీవితకాల అధ్యక్షుడిగానూ జిన్‌పింగ్ కొనసాగే అవకాశాలున్నాయి. 


గల్వాన్‌ ఘటనపై వ్యాఖ్యలు..
 
చైనాలో Communist Party of China (CPC) 20వ నేషనల్ కాంగ్రెస్ మీటింగ్‌ మొదలైంది. బీజింగ్‌లోని  Great Hall of the Peopleలో ఈ కార్యక్రమం జరిగింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అధికారికంగా ప్రారంభించారు. దీనికి చైనా మిలిటరీ కమాండర్ ఒకరు హాజరయ్యారు. ఆయన మరెవరో కాదు. 2020లో గల్వాన్‌లో భారత్, చైనా సైనికుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగిన సమయంలో గాయపడ్డ కమాండర్. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA)లోని 304 మంది సభ్యుల్లో క్వి ఫబావ్‌ ఒకరు.People’s Armed Police కూడా ఈ మీటింగ్‌కు హాజరైంది. మొత్తం 2,300 మంది ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో జిన్‌ పింగ్ కీలక ప్రసంగం చేశారు. ఈ సమయంలోనే గల్వాన్‌ నాటి ఘటనను గుర్తు చేసుకున్నారు. 
అక్కడే ఓ తెరపై అప్పటి గొడవకు సంబంధించిన వీడియోనూ ప్రదర్శించారు. సీపీసీ సాధించిన విజయాల్లో ఇదీ ఒకటని చాలా గర్వంగా చెప్పుకుంది చైనా. అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన వీడియో ఇది. ఇప్పుడు దీన్నే చూపిస్తూ...తమ విజయంగా చెప్పుకుంది చైనా. గ్రేట్ ఆడిటోరియంలో ప్రదర్శించి..వేలాది మంది ప్రతినిధులు ఆ వీడియోను చూశారు. 


Also Read: UK Political Crisis: మళ్లీ మొదలైన బ్రిటన్ ప్రధాని రేస్, ఈ సారైనా రిషి సునాక్‌ గెలుస్తారా?