China New Covid Cases: చైనాలోని వుహాన్ నగరం గుర్తుందా? కరోనా పుట్టిన ప్రాంతంగా భావిస్తోన్న వుహాన్ నగరంలో మరోసారి లాక్‌డౌన్ పెట్టారు. తాజాగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో పాక్షిక లాక్‌డౌన్ విధించినట్లు అధికారులు తెలిపారు.
మళ్లీ కేసులు
వుహాన్‌లో మళ్లీ కేసులు పెరుగుతుండటంతో పలు జిల్లాల్లో పాక్షిక లాక్‌డౌన్ విధించారు. సుమారు 9 లక్షల జనాభా కలిగిన వుహాన్‌లోని హన్‌యాంగ్ జిల్లాలో మంగళవారం ఒక్కరోజే 18 కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు అత్యవసరం మినహా మిగతా కార్యకలాపాలన్నింటినీ మూసివేయాలని నిర్ణయించారు.
సూపర్ మార్కెట్లు, ఫార్మసీలను మాత్రమే తెరిచేందుకు అనుమతిచ్చారు. ఈ లాక్‌డౌన్ నిబంధనలు వచ్చే ఆదివారం వరకూ ఉంటాయని.. పరిస్థితులను బట్టి తదుపరి కొనసాగింపు ఉంటుందని చెప్పారు.
తొలిసారి అదే
ప్రపంచంలోనే తొలిసారి లాక్‌డౌన్‌లోకి వెళ్లిన ప్రాంతంగా వుహాన్ నిలిచింది. అయితే కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తుంటే.. చైనా మాత్రం జీరో-కొవిడ్ వ్యూహాన్ని పాటిస్తోంది.
కరోనా మాట దేవుడెరుగు ముందు.. ఆంక్షలు పేరుతో జనాలను చైనా చంపేస్తోందని ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి. కఠిన లాక్‌డౌన్‌లతో చైనాలో ప్రజలు ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా బాగా వైరల్ అయ్యాయి.
చైనా అధికారుల తీరును చూస్తుంటే కరోనా వైరస్ కంటే లాక్‌డౌన్‌తోనే చైనా ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. షాంఘై వంటి నగరాల్లో భారీ స్థాయిలో ఇటీవల కొవిడ్ టెస్టులు జరిపారు. కొవిడ్ నమూనాలు ఇచ్చేందుకు నిరాకరించిన ఓ యువతిని బలవంతంగా నేలపై పడేసి శాంపిల్‌ను సేకరించిన ఓ వీడియో అప్పట్లో తెగ వైరల్ అయింది.
కొవిడ్ టెస్టుకు నిరాకరించిన ఓ వృద్ధురాలి కాళ్లను గట్టిగా పట్టుకొని శాంపిళ్లను సేకరించడం మరో వీడియోలో కనిపించింది. ఇలా షాంఘైతో పాటు పలు చైనా నగరాల్లో కొనసాగుతోన్న క్రూరమైన కొవిడ్ టెస్ట్‌లను చూసి ప్రజలు అవాక్కయ్యారు.
భారత్‌లో
దేశంలోనూ కరోనా కొత్త వేరియంట్ గుబులు పుట్టిస్తోంది. అక్టోబర్ మొదటి 15 రోజుల్లోనే మహారాష్ట్రలో కనీసం 18 ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ సబ్-వేరియంట్ కేసులు నమోదయ్యాయి. పండుగ సీజన్ కనుక కరోనా నిబంధనలను పాటించడంలో అలసత్వం వహించవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read: Madhya Pradesh Murder: షాకింగ్ ఘటన- భార్యను చూస్తున్నారని ముగ్గుర్ని కాల్చి చంపేశాడు!