China Zero-Covid Relaxations:
మార్పులు చేర్పులు..
చైనా అనుసరిస్తున్న జీరో కొవిడ్ పాలసీపై (Zero Covid Policy) అక్కడి ప్రజలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తున్నారు. కఠిన ఆంక్షలతో ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారంటూ విమర్శలూ వచ్చాయి. ఈ క్రమంలోనే చైనా...ఈ నిబంధనలను సరళతరం చేసేందుకు ప్రయత్నిస్తోంది. కొన్ని మినహాయింపులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి అధికారిరక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశముంది. National Health Commissionలో భాగంగా ప్రభుత్వ ప్రతినిధులు అదే
సంకేతాలు కూడా ఇచ్చారు. "ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం క్రమంగా తగ్గుతోంది. వ్యాక్సినేషన్ రేటుని బాగా పెంచగలిగాం" అని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా కొత్త వ్యూహాలు అమలు చేయాల్సి ఉంటుందని అన్నారు. అంటే...ఇప్పుడున్న ఆంక్షల స్థానంలో కొత్తవి రానున్నాయి. అయితే...అవి మరీ జీరో కొవిడ్ పాలసీలా కఠినంగా ఉండవని తెలుస్తోంది. పైగా...ఈ పాలసీతో చైనా ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బ తింటోంది. ఇది దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఆ విధానాన్ని పక్కన పెట్టే యోచనలో ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్లు, విద్యార్థులు, టీచర్లతోపాటు ఇంటి నుంచి పెద్దగా బయటకు రాని వాళ్లకు డెయిలీ టెస్ట్‌లు చేయడం తగ్గించాలని చూస్తోంది. అయితే...కేఫ్‌లు, రెస్టారెంట్‌లు, షాపింగ్ మాల్స్‌లోకి వెళ్లాలంటే మాత్రం కచ్చితంగా కొవిడ్ టెస్ట్ రిపోర్ట్ ఇవ్వాల్సిందే.
నిరసనలు..
చైనాలో జీరో కొవిడ్ పాలసీపై నిరసనలు మిన్నంటుతున్నాయి. ఉరుమ్‌కీ సిటీలో ఇప్పటికే ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. ఇవి క్రమంగా అన్ని నగరాలకూ విస్తృతమయ్యాయి. పలు యూనివర్సిటీల విద్యార్థులూ రోడ్లపైకి వచ్చి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. ఈ నిరసనలు ఇక్కడితో ఆగడం లేదు. సోషల్ మీడియా ప్లాటఫామ్స్‌ని ప్రభుత్వం బ్యాన్ చేసినప్పటికీ...ఏదో లూప్‌హోల్ కనుగొని...అందులో పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక పోస్ట్‌లు పెడుతున్నారు. చైనాలోని WeChat App ద్వారా ఆందోళనలు చేస్తున్నారు. ఈ యాప్ ద్వారా సమాచారం అందించుకుంటూ..ఒక్కచోట గుమి గూడుతున్నారు. ప్రతి పోస్ట్ బ్యాక్‌గ్రౌండ్‌లో నిరసనలు చేపట్టాల్సిన ఏరియాకు సంబంధించిన మ్యాప్‌ను యాడ్ చేస్తున్నారు. ఫలితంగా...అందరూ సులువుగా అక్కడికి చేరుకుంటున్నారు. అంతే కాదు. ప్రభుత్వ సెన్సార్ నుంచి తప్పించుకునేందుకు లొకేషన్‌కు సంబంధించిన కోడ్‌లను అందరికీ పంపుతున్నారు. ఆ కోడ్ ఏంటో కనుక్కుంటే...ఏ లొకేషన్‌లో నిరసనలు చేపట్టాలో అర్థమై పోతుంది. మరీ ఇంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఏంటని మండి పడుతున్నారు.
చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియన్ వ్యవహరించిన తీరు మరింత ఆగ్రహానికి గురి చేస్తోంది. ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో "దేశమంతా జీరోకొవిడ్ పాలసీపై వ్యతిరేకత వస్తోంది కదా. మరి ఆ విధానాన్ని మార్చుకుంటారా..?" అని ప్రశ్నించగా...చాలా సేపటి వరకూ మౌనంగా ఉండిపోయారు జావో. పోడియంపై అలాగే నిలుచుని పేపర్లు తిరగేస్తూ నిముషం పాటు సైలెంట్‌గా ఉన్నారు. మీడియా ప్రతినిధులంతా ఏం చెబుతారో అని ఎదురు చూశారు. కానీ...ఆయన మాత్రం ఏమీ మాట్లాడలేదు. ఈ తీరు అందరినీ ఇబ్బంది పెట్టింది. నిముషం తరవాత "అదే ప్రశ్న మరోసారి అడగండి" అని అన్నారు. రిపోర్టర్ అదే ప్రశ్నను అడగ్గా..."మీరు చెప్పిన దానికి, అక్కడ జరిగిన దానికి సంబంధం లేకుండా ఉంది" అని అన్నారు.
Also Read: Watch Video: నాన్నా మందు కావాలంటూ వెక్కివెక్కి ఏడ్చిన బుడ్డోడు, అవాక్కైన తండ్రి - వీడియో వైరల్