దేశంలో ప్రాథమిక పాఠశాలలను అత్యవసరంగా తెరవాలని.. లేదంటే భవిష్యత్‌లో ముప్పు తప్పదని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. చిన్నారులకు కోవిడ్ ముప్పు తక్కువగా ఉన్న నేపథ్యంలో స్కూళ్లను పున:ప్రారంభించాలని కోరారు. కోవిడ్ ప్రాణాంతక వ్యాధి అయినప్పటికీ.. ఇది 25 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారిపై అంతగా ప్రభావం చూపదని అమెరికా సహా పలు దేశాలు గుర్తించాయని లేఖలో ప్రస్తావించారు. కానీ విద్యను కోల్పోవడం వల్ల దీర్ఘకాలంలో పేదరికం, పోషకాహార లోపం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 


దీనికి సంబంధించి 55 మంది వైద్యుల బృందం, విద్యావేత్తలు, వైద్య నిపుణులు.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్‌లకు లేఖ రాశారు. ప్రధాన మంత్రి కార్యాలయం, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుక్ ఎల్.మాండవియా తదితరులను లేఖలో ఉద్దేశించారు. 


చిన్నారులపై ప్రభావం ఉండదు..
భారతదేశంలోని చిన్నారుల్లో 60 నుంచి 80 శాతం మందికి సహాజమైన రోగనిరోధక శక్తి ఉందని సీరో సర్వేలలో వెల్లడైందని లేఖలో పేర్కొన్నారు. తీవ్రమైన అనారోగ్యం, మరణాన్ని నివారించాలనే ఉద్దేశంతో కోవిడ్ టీకాలను అందిస్తున్నారని చెప్పారు. చిన్నారులకు టీకా వేయాల్సిన అవసరం లేదనే విషయాన్ని పలు దేశాలు సూచించాయని తెలిపారు. పాఠశాలలను మూసివేసి ఏడాదిన్నర దాటిందని.. ఇంకా ఎక్కువ కాలం కొనసాగితే ముప్పు తప్పదని హెచ్చరించారు. సరైన ప్రణాళికతో స్కూళ్లను తెరవాలని.. కోవిడ్ కేసులు పెరిగితే మళ్లీ మూసివేయాలని సూచించారు. మొదట ప్రాథమిక తరగతులను ప్రారంభించాలని.. ఆ తర్వాత ఉన్నత పాఠశాలలను తెరవాలని సూచించారు. 


డెల్టా వేరియంట్ ప్రభావం తక్కువే..
దేశంలో డెల్టా వేరియంట్ వ్యాప్తిని కూడా లేఖలో ప్రస్తావించారు. దేశ జనాభాలో మూడింట రెండు వంతుల మంది ఇప్పటికే కోవిడ్ వైరస్ బారిన పడ్డారని తెలిపారు. వీరిలో 6 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలు ఎక్కువగా ఉన్నారని పేర్కొన్నారు. చిన్నారులపై డెల్టా వేరియంట్ ప్రభావం అంతగా ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. 


ఇప్పటికే ప్రారంభమైన తరగతులు..
ఇప్పటికే ఏపీ సహా పలు రాష్ట్రాలు ప్రత్యక్ష తరగతులను ప్రారంభించిన విషయం తెలిసిందే. తెలంగాణలో సైతం వచ్చే నెల నుంచి బడి గంటలు మోగనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీ ప్రభుత్వం కూడా పాఠశాలలను పున:ప్రారంభించనున్నట్లు శుక్రవారం నాడు వెల్లడించింది. పాఠశాలల్లో కోవిడ్ కేసులు పెరుగుతుండటంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తోన్న నేపథ్యంలో ప్రభుత్వాలు సడలింపులు ఇస్తున్నాయి. తమ పిల్లలను పాఠశాలలకు పంపాలా? వద్దా? అనేది పూర్తిగా తల్లిదండ్రుల ఇష్టమని.. ఇందులో బలవంతమేమీ లేదని చెబుతున్నాయి.



Also Read: Andhra Pradesh Coronavirus: పాఠశాలల్లో కరోనా భయం.. ప్రకాశం జిల్లాలో 28 మంది విద్యార్థులకు సోకిన మహమ్మారి


Also Read: AP SSC Result 2021: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... పదో తరగతి విద్యార్థులకు ఇకపై మార్కులే... గ్రేడింగ్ విధానానికి స్వస్తి