Child Marriage Free India:
బాల్య వివాహాల రహిత భారత్..
"బాల్యవివాహాల రహిత భారత్" నినాదంతో వినిపిస్తున్నారు నోబెల్ పురస్కార గ్రహీత కైలాశ్ సత్యార్థి. కైలాశ్ సత్యార్థి చిల్డ్రన్స్ ఫౌండేషన్ (KSCF) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా దీనికి సంబంధించిన ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ఇలా ఉద్యమించ నున్నారు. రాజస్థాన్‌లోని విరాట్‌నగర్‌లో నవరన్‌పుర గ్రామంలో ఈ కార్యక్రమం మొదలు పెట్టారు. ఓ భారీ బహిరంగ సభలో దీనిపైప్రకటన చేశారు కైలాశ్. ఈ కార్యక్రమంలో 70 వేల మంది మహిళలు, బాలికలు పాలు పంచుకుంటారు. 10 వేల గ్రామాల్లో దీపాలు వెలిగిస్తూ ముందుకు సాగుతారు. 26 రాష్ట్రాల్లోని 500 జిలాల్లో ఈ ఉద్యమం సాగనుంది. ఈ ప్రచార కార్యక్రమం ప్రారంభానికి 2 కోట్ల మంది హాజరయ్యారు. బాల్య వివాహాలు అరికట్టాలంటూ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమానికి కొన్ని ప్రభుత్వ సంస్థలూ మద్దతుగా నిలుస్తున్నాయి. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF)తో పాటు 14 రాష్ట్రాల స్త్రీ, శిశు సంక్షేమ విభాగాలు, రాష్ట్ర శిశు సంరక్షణా సంస్థలు, లీగల్ సర్వీస్ అథారిటీలు, అంగన్‌వాడీలూ అండగా నిలబడుతున్నాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ మద్దతునిస్తున్నాయి. బాల్య వివాహం చేసుకున్న బాధితులతో పాటు..ఇంట్లో వాళ్లు ఒత్తిడి చేసినా ఆ బారి నుంచి తప్పించుకున్న వాళ్లు తమ అభిప్రాయాలను కైలాశ్‌తో పంచుకున్నారు. అప్పుడే ఆయనకు ప్రజల్లో మరింత అవగాహన పెంచాలన్న ఆలోచన వచ్చింది. అందులో భాగంగానే...ఈ కార్యక్రమం మొదలు పెట్టారు. పూర్తి స్థాయిలో "బాల్య వివాహాల" ఆలోచనను తుడిచిపెట్టేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మహిళా నేతలు, వైద్య నిపుణులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, మానవ హక్కుల కార్యకర్తలు, విద్యార్థులు ఇందులో పాల్గొని దీపాలు వెలిగించనున్నారు.
ఆలోచనని అడ్డుకోవాలి..
రాజస్థాన్‌లో జరిగిన సభలో ప్రసంగించారు కైలాశ్ సత్యార్థి. "బాల్య వివాహం చేయడం అంటే..మానవ హక్కుల్ని ఉల్లంఘించటమే" అని వెల్లడించారు. "ఇది నేరం అని తెలిసినా కొంత మంది ఏ మాత్రం ఆలోచించకుండా ఇప్పటికీ అదే విధంగా చిన్నారులకు పెళ్లిళ్లు చేస్తున్నారు. కొన్ని చోట్ల సమాజం దీన్ని అంగీకరిస్తుండటం బాధాకరం. మనం కచ్చితంగా ఈ ఆలోచనని అడ్డుకోవాలి" అని తేల్చి చెప్పారు. అలాగే...అమ్మాయిల వివాహ వయసుని 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచటాన్ని స్వాగతించారు. క్యాటరర్‌లు, డెకరేటర్లు, మ్యూజిక్ బ్యాండ్‌లు, ఫంక్షన్ హాల్ యజమానులకు బాల్య వివాహాలు జరుగుతున్నాయని తెలిసినప్పుడు అలాంటి వాటికి తమ సేవలు అందించకుండా ఉండాలని సూచించారు. ప్రస్తుతం బాల్య వివాహాలు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న వారు ఒంటరి కారని, వాళ్లకు తమ మద్దతు ఎప్పటికీ ఉంటుందని స్పష్టం చేశారు. "బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడే వారికి ఓ అన్నగా నేను అండగా ఉంటాను. అన్ని విధాల వాళ్లకు సాయం చేస్తాను. వాళ్లను రక్షించే బాధ్యత నేను తీసుకుంటాను. మిమ్మల్ని అలా ఒంటరిగా వదిలేయను" అని హామీ ఇచ్చారు. భారత్‌లోనే కాకుండా... ప్రపంచవ్యాప్తంగా ఇంకా "బాల్య వివాహాలు" జరుగుతున్నాయని అన్నారు. సమష్టిగా పని చేసి ఈ సమస్యకు చెక్ పెట్టాలని పిలుపునిచ్చారు.
Also Read: Delhi Excise Policy Case: ఫేక్ కేసులో నన్ను అరెస్ట్ చేయబోతున్నారు: దిల్లీ డిప్యూటీ సీఎం