ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ తండ్రి నంద్ కుమార్ బఘేల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బ్రాహ్మణ సమాజంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా ఆయనపై కేసు నమోదైంది. నంద్ కుమార్ ను కోర్టులో హాజరుపర్చగా.. 15 రోజుల కస్టడీ విధించింది న్యాయస్థానం.
సెప్టెంబర్ 21న ఆయన్ను తిరిగి కోర్టులో హాజరుపర్చనున్నారు. అయితే బెయిల్ తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఇందుకు నంద్ కుమార్ నిరాకరించినట్లు ఆయన తరుఫు న్యాయవాది తెలిపారు.
అనుచిత వ్యాఖ్యలు..
సర్వ బ్రాహ్మణ సమాజం.. నంద్ కుమార్ బఘేల్ పై కేసు పెట్టడంతో రాయ్ పుర్ పోలీసులు ఆయనపై ఎఫ్ఐర్ నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 153-ఏ (విద్వేషాలను రెచ్చగొట్టడం), 505(1)(బీ) కింద ఆయనపై కేసులు పెట్టినట్లు అధికారులు తెలిపారు. బ్రాహ్మణ సమాజంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లుగా తమకు ఫిర్యాదు అందిందని తెలిపారు.
ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో నంద్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
తప్పు చేస్తే అంతే..
అయితే ఈ అంశంపై అంతుకుముందే ఛత్తీస్ గఢ్ సీఎం స్పందించారు.
నా తండ్రి నంద్ కుమార్ బఘేల్ చేసిన వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. అయితే సమాజంలోని ఓ వర్గం ఆయన మాటలతో నొచ్చుకుంది. ఈ వ్యాఖ్యలు నన్ను కూడా బాధించాయి. - భూపేశ్ బఘేల్, ఛత్తీస్ గఢ్ సీఎం
చట్టం ముందు అందరూ సమానమేనని.. ఒకవేళ నా తండ్రి తప్పు చేశారని రుజువైతే శిక్ష అనుభవించాల్సిందేనని బఘేల్ అన్నారు.