Telangana News: తెలంగాణలో పలువురు ప్రజాప్రతినిధుల భద్రతను ప్రభుత్వం కుదించింది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వారికి ఇచ్చే సెక్యూరిటీలో మార్పులు చేర్పులు చేసినట్టు పోలీసు శాఖ వివరించింది. అందరి ఎమ్మెల్యేలకు కేటాయించినట్టుగానే 2+2 భద్రత కల్పిస్తున్నట్టు తెలిపింది.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తోపాటు అందరికి ఇచ్చే సెక్యూరిటీలో మార్పులు చేర్పులు చేశారు. ప్రతిపక్ష నేత హోదా ఉన్న కేసీఆర్‌కు వై కేటగిరి భద్రత కల్పించారని సమాచారం. అంటే ఆయన చుట్టూ నలుగురు గన్‌మెన్‌లు ఉంటారు. ఎస్కార్, పైలట్ వెహికల్ ఉంటుంది. ఆయన ఇంటి ముందు ఓ సెంట్రీతోపాటు మరో ఇద్దరు కాపాలా ఉంటారు.
కేసీఆర్‌కు ఒక్కసారిగా భద్రత కుదించడంపై బీఆర్‌ఎస్ నేతలు మండిపడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రికి ఇలా ఒకేసారి భద్రత కుదించడం మంచిది కాదని అంటున్నారు. ప్రస్తుతం కేసీఆర్ యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇవాళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారు. అనంతరం నందినగర్‌లోని ఇంటికి వెళ్తారు. అనంతరం ఆయన ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్లే ఛాన్స్ ఉంది.
ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన మంత్రులకు 2+2 భద్రత ప్రొవైడ్ చేశారు. ఓడిపోయిన నేతల భద్రతను పూర్తిగా తొలగించారు. అన్ని పార్టీలకు ఇది వర్తిస్తుందని పోలీసులు శాఖ తెలిపింది.