Chandrababu Arrest: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసుతో విజయవాడలోని ఏసీపీ ప్రత్యేక కోర్టుపై ఫోకస్ పెరిగిపోయింది. చంద్రబాబు అరెస్టు, 14 రోజుల రిమాండ్ తో పాటు ఆయన తరఫు న్యావాదులు దాఖలు చేసిన చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ కూడా తిరస్కరణకు గురైంది. ఈ పరిస్థితుల్లోనే విజయవాడ ఏసీపీ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమబిందుకు ఏపీ సర్కారు ప్రత్యేక భద్రత కల్పించింది. 4+1 ఎస్కార్ట్ భద్రత కల్పించింది. కాగా ప్రస్తుతం స్కిల్ డెవలప్ మెంట్ కేసులో దాఖలు అయిన పిటిషన్లపై న్యాయవాది హిమబిందు విచారణ జరుపుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఎలాంటి ఘటనలకు ఆస్కారం లేకుండా.. జస్టిస్ హిమబిందుకు సర్కారు భద్రత పెంచినట్లు తెలుస్తోంది. మరోవైపు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన హౌస్ కస్టడీ పిటిషన్ ను ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకు ఎలాంటి ముప్పు లేదన్న సీఐడీ తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించింది. భద్రతపై చంద్రబాబు తరఫు లాయర్లు చేసిన వాదనలను న్యాయస్థానం తిరస్కరించిన విషయం అందరికీ తెలిసిందే.
హైకోర్టులో క్వాష్ పిటిషన్ - నేడే విచారణ
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో సీఐడీ నమోదు చేసిన కేసు, ఏసీబీ కోర్టు ఇచ్చిన రిమాండ్ ఆర్డర్లను కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు తరపు లాయర్లు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణ ముగిసేవరకూ ఏసీబీ కోర్టులో విచారణపై స్టే విధించాలని కోరారు. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ మంగళవారం (సెప్టెంబరు 12) హైకోర్టు ప్రారంభ సమయంలో ఈ పిటిషన్ వేశారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ప్రకారం ఎవరైనా పబ్లిక్ సర్వెంట్‌పై కేసు పెట్టాలంటే, లేదా దర్యాప్తు చేయాలంటే కూడా గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని గుర్తు చేశారు. అలాంటిదేమీ లేకుండా చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా సీఐడీ వ్యవహరించిందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాస రెడ్డి వద్ద ప్రస్తావించారు. లంచ్ మోషన్ పిటిషన్‌గా దీన్ని స్వీకరించాలని కోరారు. అయితే, ఈ పిటిషన్ బుధవారం విచారణకు రానుంది.
‘‘ఈ కేసు తొలుత నమోదైన 22 నెలల తర్వాత ఎలాంటి కనీస సాక్ష్యాలు లేకపోయినా ఉద్దేశపూర్వకంగా, ముఖ్యమంత్రి కక్ష్యతోనే నన్ను ఇరికించారు. ప్రాణాలకు ముప్పు ఉందని కేంద్ర ప్రభుత్వం నాకు జడ్+ సెక్యూరిటీ కల్పించింది. అయినా రాజకీయ ప్రత్యర్థులు నన్ను అంతం చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. నన్ను జైలులో ఉంచడం సేఫ్ కాదు. జడ్+ సెక్యూరిటీకి నన్ను దూరంగా ఉంచాలి. దాని ద్వారా ప్రత్యర్థులు టార్గెట్‌ను సులువుగా సాధించగలుగుతారు’’ అని పిటిషన్‌లో వివరించారు.
చంద్రబాబు హాయంలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ల ఏర్పాటు కోసం ఏపీఎస్‌ఎస్‌డీసీ, సీమెన్స్ మధ్య జరిగిన ఒప్పందం విషయంలో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఛైర్మన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 2021 డిసెంబరు 9న ఏపీ సీఐడీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. అయితే, ఆ రోజు ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పాత్ర లేనేలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఓ నిందితుడు చెప్పారని ఏడాది తర్వాత చంద్రబాబు పేరును తెరపైకి తెచ్చారు. తప్పుడు ఆ కేసులో ఇరికించి తనను అరెస్టు చేయాలని రాష్ట్రప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని పని చేసింది. సీఐడీ రిమాండ్ రిపోర్టులో ఒక్కటైనా చెల్లుబాటు అయ్యే ఆధారాలు లేవని పిటిషనర్ వివరించారు.