Chandigarh Vendor Viral: 


భలే ఆఫర్..బట్ కండీషన్స్ అప్లై..


కరోనా రెండు డోసులైతే వేసుకున్నారు కానీ..బూస్టర్ డోస్ తీసుకోవటంలో మాత్రం చాలా మంది నిర్లక్ష్యమే చేస్తున్నారు. అర్హులైన వారిలో కనీసం 10% మంది కూడా ప్రికాషనరీ డోస్ తీసుకోలేదని కేంద్రం ఇటీవలే వెల్లడించింది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా 75 రోజుల పాటు బూస్టర్ డోస్‌లు అందించే కార్యక్రమం ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఛండీగఢ్‌లో ఓ ఫుడ్ స్టాల్‌ నడిపే వ్యక్తి బూస్టర్ డోస్ తీసుకున్న వారికి ఉచితంగా ఛోలే బచూర్ అందిస్తున్నాడు. గతేడాది కూడా వ్యాక్సిన్ కార్డులు చూపిస్తే, వారికి ఉచితంగా బచూర్ అందించి ఫేమస్ అయ్యాడు సంజయ్ రాణా. అప్పట్లో ప్రధాని మోదీ మన్‌ కీ బాత్ కార్యక్రమంలో ఈ వ్యక్తిని అభినందించారు.ఇప్పుడు ఇదే తరహాలోబూస్టర్ డోస్ తీసుకున్న వారికి చోలే బచూర్ ఉచితంగా ఇస్తున్నాడు సంజయ్ రాణా. ఫుడ్ స్టాల్‌ను నడపడమే కాకుండా సైకిల్‌పై తిరుగుతూ చోలే బచూర్‌ అమ్ముతూ ఉంటాడు. దాదాపు 15 సంవత్సరాలుగా ఇదే వ్యాపారం చేస్తున్నాడు. ఆయన కూతురు రిధిమ, కోడలు రియా ఇచ్చిన సలహా మేరకు ఇలా ఉచితంగా చోలే బచూర్‌ను అందిస్తున్నట్టు చెబుతున్నాడు సంజయ్. ఇటీవలే బూస్టర్ డోస్ తీసుకున్న ఆయన...చాలా తక్కువ మంది వ్యాక్సిన్‌ వేయించుకుంటున్నారని గమనించాడు. అందుకే ఈ కొత్త ఆలోచనతో ముందుకొచ్చాడు. ఈ ఆఫర్ బూస్టర్ డోస్ తీసుకున్న రోజు మాత్రమే వర్తిస్తుంది. అంటే...ఏ రోజైతే బూస్టర్ తీసుకుంటారో, ఆ రోజే వెంటనే కార్డ్ చూపించి చోలే బచూర్ పొందొచ్చు. 


ఇది నాకెంతో సంతృప్తినిస్తోంది: సంజయ్ 


"అర్హులైన వారందరూ బూస్టర్ డోస్ తీసుకోవాలి. ఇప్పటికే దేశవ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు పెరుగుతుండటాన్ని చూస్తున్నాం. పరిస్థితులు చేయి దాటిపోయేంత వరకూ ఎందుకు చూడటం..? గతేడాది ఏప్రిల్-మేలో మనం ఎలాంటి దారుణాలు చూశామో గుర్తుంది కదా. ఆ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుందాం" అని అంటున్నాడు సంజయ్ రాణా. "చిన్నప్పటి నుంచి నాకు ఆర్మీలో చేరాలనే కల ఉండేది. కానీ నా విధి నన్ను వేరే వైపు నడిపించింది. కనీసం ఈ విధంగానైనా ప్రజలకు సేవ చేస్తున్నాను. ఇది నాకెంతో సంతృప్తినిస్తోంది" అని చెబుతున్నాడు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని హమీర్‌పుర్‌లో పుట్టి పెరిగాడు సంజయ్ రాణా...ప్రధాని మోదీ మన్‌కీ బాత్‌లో తన పేరుని ప్రస్తావించటం ఎంతో ఆనందాన్నిచ్చిందని అన్నాడు. పదో తరగతి వరకూ చదివిన రాణా, తండ్రి చనిపోయాక కుటుంబ బాధ్యతలు తీసుకున్నాడు. కొన్నేళ్ల క్రితం ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేసి, తరవాత సొంతగా వ్యాపారం మొదలు పెట్టాడు. 


Also Read: Tomato Rates Drop : టమాటా ధరలు భారీగా పతనం, కిలో ధర రూ.5 దిగువకు!


Also Read: Anchor Suma : కమెడియన్ చేత అమ్మాయికి తాళి కట్టించిన సుమ - తర్వాత యూట్యూబ్‌లో వీడియో డిలీట్‌