Reliance Shares: చండీగఢ్ కు చెందిన రత్తన్ ధిల్లాన్ అనే వ్యక్తి ఇటీవల తన ఇల్లు సర్దుతుంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) షేర్లకు సంబంధించిన పత్రాలను చూశాడు. అవి తన తాతలు కొన్నారు. అప్పట్లో అవి రూపాయల్లోనే ఉన్నా.. ఇప్పుడు విలువ లక్షల్లోనే ఉంటుంది. తన తాత ఎంత మంచివాడో అనుకున్నాడు కానీ ఇప్పుడు వాటికి తానే వారసుడ్నని నిరూపించుకోవడం పెను సమస్యగా మారింది.
అప్పట్లో కంప్యూటర్లు ఉండేవి కావు. సాఫ్ట్ వేర్ లేదు. అంతా మాన్యువల్ ప్రక్రియ మీద షేర్స్ జారీ చేసేవారు. ఇప్పుడు వాటిని డిజిటలైజ్ చేయించుకునేందుకు రతన్ థిల్లాన్ ప్రయత్నించాడు. కానీ ఈ ప్రక్రియలో చట్టపరమైన వారసుడి సర్టిఫికేట్, వారసత్వ సర్టిఫికేట్ , ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ (IEPFA) నుండి ఆమోదంతో సహా చాలా పని ఉందని తెలియడంతో నీరసపడిపోయాడు. ఇవన్నీ క్లియర్ చేసుకోవాలంటే.. నెలల తరబడి తరగాల్సి ఉంటుందని తెలుసుకుని.. ఈ షేర్స్ ను పక్కన పడేయాలని అనుకుంటున్నాడు.
ధీరూభాయ్ అంబానీ సంతకాలు వృధా అవుతాయని అనిపిస్తుందని.. షేర్లను డిజిటలైజ్ చేయించుకునే ప్రక్రియ చాలు సుదీర్ఘంగా ఉందని నిరాశ వ్యక్తం చేశాడు. చట్టపరమైన వారసుడి సర్టిఫికేట్ పొందడానికి మాత్రమే 6-8 నెలలు పడుతుంది, IEPFA ప్రక్రియకు 2-3 సంవత్సరాలు పడుతుంది. నేను ఇంత సమయం కేటాయించలేనని ట్విట్టర్‌లో పోస్టు పెట్టాడు
చాలా మంది అతన్నిప్రోత్సహించారు. IEPFA ప్రక్రియకు 2-3 సంవత్సరాలు కాదు, కొన్ని నెలలు పడుతుందని అయితే ప్రయత్నించడం మేలని కొంత మంది సూచించారు. మరికొందరు పనిని అవుట్‌సోర్స్ చేయాలని సూచించారు. సంవత్సరాలుగా స్టాక్ విభజనలు ,బోనస్‌లు షేర్ల విలువను గణనీయంగా పెంచి ఉండవచ్చని పలువురు సూచించారు. ఇవి మాత్రమే షేర్లు కాదు , రిలయన్స్ బోనస్‌లను జారీ చేసింది ఇంకా ఎక్కువ ఉంటాయని.. వృధా చేయవద్దని సూచించారు.
క్లెయిమ్ చేయని షేర్ల విషయంలో మోసాలు జరగకుండా కఠినమైన రూల్స్ పెట్టారు. ప్రస్తుతానికి ధిల్లాన్ భౌతిక సర్టిఫికెట్‌లను ఉంచుకోవాలని నిర్ణయించుకున్నారు.