కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు గుడ్ న్యూస్ చెప్పింది. వంట నూనెల ధరలు పెరగకుండా కట్టడి చేసేందుకు, వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం ద్వారా ముడి పామాయిల్‌పై ప్రస్తుతం 10 శాతంగా దిగుమతి సుంకం 2.5 శాతానికి తగ్గింది. ముడి సోయాబీన్, పొద్దుతిరుగుడు నూనెలపై 7.5 శాతంగా ఉన్న దిగుమతి సుంకం.. 2.5 శాతానికి తగ్గింది. దిగుమతి సుంకం సహా అన్ని రకాల పన్నులను కలిపి ఈ 3 రకాల ముడి నూనెలపై 24.75 శాతానికి, రిఫైన్డ్ ఆయిల్ రకాలపై 35.75 శాతానికి పరిమితం కానున్నాయి.
లీటరుపై రూ.4 నుంచి రూ.5 వరకు తగ్గొచ్చు..
దిగుమతి సుంకం తగ్గింపుతో నూనె ధరలు తగ్గే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. వినియోగదారుల వద్దకు వచ్చే సరికి ఒక్కో లీటరు నూనె ధరపై రూ.4 నుంచి రూ.5 వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. తాజా నిర్ణయం వల్ల ప్రభుత్వం దాదాపు రూ.1100 కోట్ల ఆదాయాన్ని కోల్పోతుందని ఆర్థిక శాఖ వెల్లడించింది.
ఆకాశాన్నంటిన నూనె ధరలు..
కోవిడ్ కారణంగా గతంలో ఎన్నడూ లేని విధంగా వంట నూనె ధరలు ఆకాశాన్నంటాయి. దేశవ్యాప్తంగా కొద్ది నెలలుగా పేదవాడికి అందనంత ఎత్తుకు ఎదిగి చుక్కలు చూపెట్టాయి. కోవిడ్ ప్రభావంతో వంట నూనెల ధరలను 70 నుంచి 90 శాతం వరకు పెంచారు. కొన్ని బ్రాండ్ల నూనెల ధరైతే ఏకంగా రెట్టింపు అయింది. ఏప్రిల్ నెలలో లీటర్ సన్‍ఫ్లవర్ ఆయిల్ ధర రూ.90 నుంచి రూ.100 మధ్యలో ఉండగా.. ధరల పెంపులో ఏకంగా రూ.180కి చేరింది. వేరుశనగ, సోయా, పామాయిల్, ఆవనూనె ధరలు సైతం మిన్నంటాయి. దేశంలో నూనె గింజల దిగుబడి తగ్గడంతో పాటు కోవిడ్ ప్రభావం కారణంగా ధరలు పెరిగాయని వ్యాపారులు చెప్పారు.
భారతదేశం దిగుమతి సుంకం తగ్గించాక.. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతాయనే విషయం తెలిసిందే. కాబట్టి ఈ తగ్గింపు, వాస్తవ ప్రభావం లీటరుకు 2 నుండి 3 రూపాయలు కావచ్చు. ఎస్ఈఏ ప్రకారం.. 2020 నవంబరు నుండి 2021 జూలై వరకు మొత్తం కూరగాయల నూనెల దిగుమతి రెండు శాతం తగ్గింది. అంటే 96,54,636 టన్నులకు తగ్గింది. కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు (సీబీఐసీ) గత నెలలో సరఫరాను పెంచడానికి ముడి సోయా నూనె, పొద్దుతిరుగుడు నూనెలపై ప్రాథమిక దిగుమతి సుంకాన్ని 7.5 శాతానికి తగ్గించింది.