టెస్లా, స్పెస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలన్ మస్క్‌కు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. టెస్లా నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లను తీసుకురానున్నట్లు మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే. టెస్లా కార్లపై దిగుమతి సుంకం తగ్గించాలని మస్క్ భారత ప్రభుత్వాన్ని కోరారు. దీనికి బదులిచ్చిన కేంద్ర ప్రభుత్వం.. ముందుగా ఇండియాలో ఉత్పత్తి ప్రారంభించాలని (మేక్ ఇన్ ఇండియా) టెస్లాకు సూచించింది. ఆ తర్వాతే దిగుమతి సుంకాలను తగ్గించాలా? వద్దా? అనే అంశాన్ని పరిశీలిస్తామని తేల్చి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఏ కంపెనీకి కూడా ప్రత్యేకమైన రాయితీలు ఇవ్వలేదని కేంద్రం చెప్పినట్లు తెలుస్తోంది. టెస్లాకు రాయితీలు ఇస్తే.. మిగతా కంపెనీలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని కేంద్రం వ్యాఖ్యానించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
టెస్లా కార్లతో ఇండియా మార్కెట్లో పట్టు సాధించాలని మస్క్ కొంత కాలంగా ప్రయత్నిస్తున్నారు. కార్ల ఉత్పత్తికి సంబంధించి పలు మార్లు ట్వీట్లు కూడా చేశారు. ఇండియాలో దిగుమతి సుంకాలు ఎక్కువని.. అందుకే ఉత్పత్తి ఆలస్యమవుతుందని అందులో ప్రస్తావించారు. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలపై (ఈవీ) దిగుమతి సుంకాలు ఎక్కువని.. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇంత అధికంగా లేవని చెప్పారు. దిగుమతి సుంకాలు తగ్గించాలని కోరుతూ.. ప్రభుత్వానికి లేఖ రాశారు.
కార్ల తయారీ కష్టమన్న మస్క్.. నిజమేనన్న ఆనంద్ మహీంద్రా..
కార్ల తయారీ కష్టమని ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు. లాభాలతో సంస్థను నడపడం ఇంకా కష్టమని చెప్పుకొచ్చారు. మస్క్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నట్లు మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.