Nipah Virus in Kerala: కేరళలో మరోసారి నిఫా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్రం అప్రమత్తం కాగా కేంద్ర ప్రభుత్వం కూడా అలెర్ట్ అయింది. ఇప్పటికే ఓ 14 ఏళ్ల బాలుడు నిఫా సోకి ప్రాణాలు కోల్పోయాడు. ప్రాణాలు తీసిన ఈ వైరస్‌ శాంపిల్‌ని పుణేలోని National Institute of Virology కి పంపించారు. ఈ క్రమంలోనే కేరళ ప్రభుత్వానికి కేంద్రం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇప్పటి వరకూ ఎన్ని కేసులు నమోదయ్యాయో మరోసారి పరిశీలించాలని తెలిపింది. బాధితుల కుటుంబ సభ్యులనూ టెస్ట్ చేయాలని సూచించింది. ఆ పరిసర ప్రాంతాలపైనా నిఘా పెట్టాలని వెల్లడించింది. వీలైనంత వరకూ టెస్ట్‌లు పెంచాలని తెలిపింది. బాధితులున్న పరిసరాల్లో కేసులు నమోదయ్యే అవకాశముండొచ్చని స్పష్టం చేసింది. బాధితులు గత 12 రోజులుగా ఎవరెవరిని కలిశారో తెలుసుకోవాలని, వాళ్లలోనూ లక్షణాలేమైనా ఉన్నాయో గుర్తించాలని వెల్లడించింది. అంతే కాదు. బాధితులను వెంటనే క్వారంటైన్‌లో ఉంచాలని ఆదేశించింది. ఎవరికి లక్షణాలు కనిపించినా వెంటనే ఐసోలేషన్‌కి పంపాలని తేల్చి చెప్పింది. బాధితుల నుంచి శాంపిల్స్ సేకరించి వెంటనే ల్యాబ్‌కి పంపించాలని స్పష్టం చేసింది. వీలైనంత త్వరగా శాంపిల్స్‌ని ల్యాబ్‌కి పంపడం ద్వారా వ్యాప్తిని అరికట్టేందుకు వేగవంతమైన చర్యలు తీసుకునేందుకు అవకాశముంటుందని కేంద్రం అభిప్రాయపడింది. 




కేరళ ప్రభుత్వానికి సాయం అందించేందుకు One Health Mission కింద కేంద్ర ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా టీమ్‌ని పంపించనుంది. ఇప్పటి వరకూ నమోదైన కేసులను పరిశీలించడంతో పాటు ఇది మహమ్మారిగా మారే ప్రమాదముందా లేదా అన్నదీ తెలుసుకోనుంది. ఇప్పటికే మొబైల్ బయోసేఫ్‌టీ ల్యాబ్‌నీ కొజికోడ్‌కి పంపించింది. అక్కడికక్కడే పరీక్షలు నిర్వహించి పాజివిట్‌ అవునా కాదా తేల్చనుంది. నిజానికి కేరళలో గతంలోనూ నిఫా వైరస్ వ్యాప్తి కలకలం సృష్టించింది. గబ్బిలాల ద్వారా వ్యాప్తి చెందే ఈ వైరస్‌ ప్రాణాంతకంగా మారుతోంది. గబ్బిలాల అవశేషాలు ఉన్న పండ్లు, కూరగాయలు తిన్నా వెంటనే ఈ వైరస్ సోకుతోంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. బయట కూరగాయలు, పండ్లు కొన్నప్పుడు వాటిని శుభ్రం చేశాకే వాడుకోవాలని సూచించింది. అంతే కాదు. బయట ఓపెన్ కంటెయినర్‌లలో విక్రయించే ఆహార పదార్థాలను కొనుగోలు చేయొద్దని వెల్లడించింది.