Central Cabinet Telugu Ministers portfolios :  కేంద్ర మంత్రివర్గంలోని తెలుగు మంత్రులకు శాఖలు కేటాయించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. కేబినెట్ ర్యాంక్‌లో ఉన్న టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడుకు పౌరవిమానయాన శాఖ కేటాయించారు. గతంలో ఎన్డీఏ 1 హయాంలో కూడా టీడీపీ కేంద్రంలో భాగస్వామిగా ఉంది.అప్పట్లో కూడా కేబినెట్ మంత్రిగా టీడీపీ తరపున అశోక్ గజపతిరాజు వ్యవహరించారు. ఇప్పుడు అదే శాఖను రామ్మోహన్ నాయుడుకు కేటాయించారు. బోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం శరవేగంగా జరుగుతుందని భావిస్తున్నారు. 


తెలంగాణ నుంచి కేబినెట్ ర్యాంక్ దక్కించుకున్న సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిషన్ రెడ్డికి బోగ్గు, గనుల శాఖను కేటాయించారు. గతంలో కిషన్  రెడ్డి టూరిజం, నార్త్ ఈస్ట్ రాష్ట్రాల వ్యవహారాల మంత్రిత్వ శాఖను చూశారు. గత ప్రభుత్వంలో బొగ్గు శాఖను చూసిన ప్రహ్లాద్ జోషి స్థానంలో ఈ సారి కిషన్ రెడ్డికి చోటు కల్పించారు. 


ఇక తెలంగాణ బీజేపీ కీలక నేత బండి సంజయ్ కు సహాయ మంత్రి లభించింది. ఆయనకు హోంశాఖకు సహాయ మంత్రిగా వ్యవహరిస్తారు. ఈ శాఖకు కేబినెట్ మంత్రిగా అమిత్ షా ఉన్నారు. కిషన్  రెడ్డికి కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ రాక ముందు.. సహాయ మంత్రిగా హోంశాఖకే పని చేశారు. 


ఏపీకి చెందిన గుంటూరు ఎంపీకి గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖకు సహాయ మంత్రిత్వ శాఖను కేటాయించారు.  ఇక నర్సాపురం ఎంపీ, సహాయ మంత్రిగా ప్రమాణం చేసిన భూపతిరాజు శ్రీనివాసవర్మకు కూడా కీలక శాఖలు లభించాయి. భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖలకు ఆయన సహాయ మంత్రిగా వ్యవహరిస్తారు. 


ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తెలుగుదేశం  పార్టీకి వచ్చిన హైప్‌ను బట్టి చూస్తే.. అనుకున్న విధంగా కీలక శాఖలు రాలేదని అనుకోవచ్చు. కింగ్ మేకర్ గా టీడీపీని జాతీయ రాజకీయ నేతల అభివర్ణించారు. అయితే కేబినెట్ లో ఆ స్థాయిలో ప్రాధాన్యం మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. పది కేంద్ర మంత్రి పదవులు, స్పీకర్ పోస్టును టీడీపీ అడిగిందని ప్రచారం జరిగింది. చివరికి ఒక్క కేబినెట్, ఒక్క సహాయ మంత్రి పదవితో సరిపెట్టారు. వారి శాఖలు కూడా ఏపీకి అంతగా ఉపయోగపడేవి కావు. కనీసం రామ్ మోహన్ నాయుడికి పట్టణాభివృద్ధి శాఖను ఇచ్చినా ఏపీ కి రాజధాని నిర్మించుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుందని అనుకున్నారు. కానీ గతంలో అశోక్ గజపతిరాజుకు ఇచ్చిన పౌర విమానయానమే ఇచ్చారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న బోగాపురం ఎయిర్ పోర్టును వేగంగా పూర్తి చేసుకునే అవకాశం మాత్రం లభిస్తుంది.
 


అయితే కిషన్ రెడ్డికి మాత్రం బొగ్గు,  గనులు వంటి కీలకమైన శాఖను కేటాయించారు. తెలంగాణలో బొగ్గు గనులు ఎక్కువగా ఉన్నాయి. సింగరేణి కూడా ఉంది. అందుకే కిషన్ రెడ్డికి మంచి ప్రాధాన్యం లభించిందని అంచనా వేస్తున్నారు. ఇక సహాయ మంత్రులకు కేటాయించిన శాఖలు కీలకమైనవే కానీ... వారికి ఉండే అధికారాలు పరిమితమని భావిస్తున్నారు. గుంటూరు ఎంపీ పెమ్మసాని మెడికల్ రంగంలో నిపుణుడు. ఆయనకు ఆరోగ్య శాఖ సహాయ మంత్రి పదవి కేటాయిస్తారేమో అనుకున్నారు. కానీ గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖను కేటాయించారు.