AI Deep Fake Content: డీప్‌ఫేక్‌ సమస్యని పరిష్కరించేందుకు మోదీ సర్కార్‌ కొత్త అస్త్రాన్ని సిద్ధం చేస్తోంది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఇందుకు సంబంధించి ఓ బిల్‌ని ప్రవేశపెట్టనున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. AI టెక్నాలజీతో క్రియేట్ చేస్తున్న వీడియోలతో పాటు ఇతరత్రా కంటెంట్‌ని కట్టడి చేసేందుకు Digital India Bill పేరుతో కొత్త బిల్‌ పెట్టేందుకు సిద్ధమవుతోంది. కేవలం డీప్‌ఫేక్ వీడియోలను కట్టడి చేసేందుకే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ని ఎలా వినియోగించుకోవాలో ఈ బిల్లులో ప్రస్తావించనున్నట్టు తెలుస్తోంది. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే ముందే పార్టీలో అంతర్గంతా చర్చించి ఆ తరవాత నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. 


జూన్ 24వ తేదీ నుంచి 18వ లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జులై 3న ఈ సమావేశాలు ముగుస్తాయి. ఆ తరవాత జులై 22న వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతాయి. ఆగస్టు 9 వరకూ ఇవి కొనసాగనున్నాయి. త్వరలోనే ఈ సమావేశాల్లోనే డిజిటల్ ఇండియా బిల్ ప్రవేశపెడతారని అంటున్నారు. నిజానికి ఇందుకు సంబంధించి కేంద్ర ఐటీ శాఖమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ గతంలోనే హింట్ ఇచ్చారు. తదుపరి ప్రభుత్వం ఏర్పాటు కాగానే పని మొదలు పెడతామని స్పష్టం చేశారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటైన క్రమంలోనే మళ్లీ AI డీప్‌ఫేక్ కంటెంట్‌పై పూర్తి స్థాయిలో కసరత్తు జరుగుతోంది. ఎన్నికల ముందే ఇదంతా జరిగిపోవాలని ప్రయత్నించినా అది సాధ్యపడలేదు. దీనిపై ఎంతో చర్చ జరగాల్సి ఉందని, అదేమీ లేకుండా బిల్ తయారు చేయలేమని రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. 


Also Read: PM Modi: ఇటలీ పర్యటన ముగించుకుని భారత్‌కి మోదీ, G7 సదస్సుపై కీలక వ్యాఖ్యలు