Center to soon form committee on water disputes of Telugu states: తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి నిపుణులతో ఓ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో.. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ సమక్షంలో చర్చలు జరిగాయి. దాదాపుగా గంటన్నర పాటు జరిగిన సమావశంలో .. ఇరు రాష్ట్రాలు కొన్ని అంశాలను ప్రస్తావించాయి. ఈ క్రమంలో జల వివాదాల పరిష్కారానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నిపుణుల కమిటీ ఇచ్చే నివేదికను బట్టి నిర్ణయం తీసుకుంటారని మంత్రి నిమ్మల తెలిపారు.
సమావేశంలో తీసుకున్న ఐదు కీలక నిర్ణయాలు
1. ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించి టెలిమెట్రీ యంత్రాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనకు ఆంధ్రప్రదేశ్ అంగీకారం
2. గోదావరి నది యాజమాన్య బోర్డు తెలంగాణలో… కృష్ణ నది యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్ కు అంగీకారం 3. శ్రీశైలం ప్రాజెక్ట్ మరమ్మతులకు ఆంధ్రప్రదేశ్ అంగీకారం 4. ఇరు రాష్ట్రాల్లో గోదావరి, కృష్ణా నదులపై ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ సమస్యల పరిష్కారానికి అధికారులు, సాంకేతిక నిపుణులతో కమిటీ నియామకం.. వారం రోజుల్లో కమిటీ నియామకం 5. ఇరు రాష్ట్రాల మధ్య చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయి… అన్ని సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని నిర్ణయం..
ఈ సమావేశంలో తెలంగాణ మొత్తం 13 అంశాలను ఎజెండాలో ప్రతిపాదించింది.
1. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల పథకానికి అనుమతులు ఇవ్వాలి 2. శ్రీశైలం నుంచి వేరే బేసిన్ కి ఆంధ్రప్రదేశ్ నీటి తరలింపు పనులను వెంటనే ఆపేయాలి3. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రారంభించిన ప్రాజెక్టులకు సహకరించేలా కృష్ణ ట్రిబ్యునల్ లో మద్దతుగా వాదించేలా ఏపీని ఒప్పించాలి. 4. కృష్ణానది జలాలను వేరే బేసిన్ కు తరలించకుండా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చర్యలు తీసుకునేలా ఆదేశించాలి. కృష్ణా జలాలను అక్రమంగా తరలింపును అడ్డుకునేందుకు టెలిమెట్రీలను ఏర్పాటు చేసేందుకు ఏపీ ఒప్పుకోవాలి 5. తుంగభద్ర బోర్డు నీటి తరలింపు పై చర్చించాలి. 6. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకంపై ఎన్జీటీ ఉత్తర్వులను అమలు చేసే విధంగా కేంద్ర జలశక్తి శాఖ చర్యలు తీసుకోవాలి . ఆ మేరకు పునరుద్ధరణ జరపాలి . ఈ పథకంపై చట్టపరంగానే ముందుకు వెళ్లాలి 7. శ్రీశైలం కుడి కాలువ ద్వారా ఎక్కువ నీటి తరలింపు ను నియంత్రించాలి 8. శ్రీశైలం ప్రాజెక్టులో కొత్త ప్రాజెక్టులు హంద్రీనీవా, వెలిగొండ, గురు రాఘవేంద్ర నిర్మాణాలను నియంత్రించాలి 9. శ్రీశైలం డ్యాం సేఫ్టీ కి తగిన చర్యలు తీసుకోవాలి 10. శ్రీశైలం నుంచి నీటి తరలింపు ద్వారా విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర విఘాతం కలుగుతుంది దీనిని అడ్డుకోవాలి. 11. పోలవరం ప్రాజెక్టు తరహాలోనే ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి. ఇచ్చంపల్లి నుంచి కావేరి కి గోదావరి జలాల తరలింపుకు మేము సిద్ధం. అందులో 200 టీఎంసీల నీటిని వాడుకునేందుకు అనుమతులు ఇవ్వాలి. 12. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలి 13.ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టుకు ఏఐబిపి కింద నిధులు ఇవ్వాలి. మహారాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వమే చర్చలు జరిపి తుమ్మిడి హట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణానికి సహకరించాలి
ఏపీ ప్రభుత్వం బనకచర్ల అంశం ఒక్కటే చర్చిస్తే సరిపోతుందని ప్రతిపాదించింది. అయితే రెండు రాష్ట్రాలు ప్రతిపాదించిన అంశాలపై లోతుగా చర్చించలేదు. నిపుణుల కమిటీని నియమించాలని నిర్ణయించారు. అలాగే కృష్ణా యాజమాన్య నదీ బోర్డు ఏపీలో.. జీఆర్ఎంబీ తెలంగాణలో ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. శ్రీశైలం ప్రాజెక్టును కాపాడుకోవాలని అనుకున్నారు. నిపుణుల కమిటీని సోమవారంలోపు ఏర్పాటు చేయనున్నారు.