Onion Prices :  టమాటా ధరలు దాదాపుగా అందుబాటులోకి వచ్చాయి. ఓ దశలో  కేజీ రెండు వందలు దాటిపోయాయి. ఇప్పుడు కేజీ ముఫ్పై, నలబై వరకూ దిగి వచ్చాయి అయితే  ఉల్లి ధ‌ర‌లూ  ఘాటెక్కాయి. దేశ‌వ్యాప్తంగా ఉల్లి ధ‌ర‌లు పెరుగుతూండటంతో  కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ధ‌ర‌ల‌ను కిందికి దింపేందుకు త‌న వ‌ద్ద ఉన్న మిగులు నిల్వ‌ను మార్కెట్‌లోకి విడుద‌ల చేసేందుకు కేంద్రం సంసిద్ధ‌మైంది. 2023-24లో మిగులు నిల్వ కింద మూడు ల‌క్ష‌ల ట‌న్నుల ఉల్లిని నిల్వ చేస్తామ‌ని గ‌తంలో కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.


క్రమంగా పెరుగుతున్న ఉల్లి ధరలు


అనేక మార్కెట్లలో శుక్రవారం క్వింటాలు ఉల్లిపాయ ధర 13 వందల రూపాయలకు చేరుకుంది. రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లో ఈ సంవత్సరం ఉల్లిపాయల పంట బాగా పండింది. ఫిబ్రవరి నెల చివర్లో విపరీతంగా ధరలు పడిపోయి ఉల్లిపాయలను కిలో రూపాయి, రెండు రూపాయలకు అమ్ముకోవాల్సి వచ్చింది. అప్పుడు రైతులు ఉల్లిపాయలను రవాణా ఖర్చులు కూడా దండగ అవుతాయని రోడ్లపై పారబోసి వెళ్ళారు. కానీ ఇప్పుడు ఉల్లిపాయల ధర మండిపోతుంది. ఉల్లిపాయల డిమాండ్ ఎక్కువగా ఉండటం, అందుకు తగ్గట్టుగా సప్లై లేకపోవడం, అకాల వర్షాల వల్ల ఉల్లి పంట దెబ్బతినడం, తగ్గిన దిగుబడి కారణంగా ప్రస్తుతం ఉల్లి ధరలు కూడా పెరుగుతున్నాయి.                                


ఉల్లి నిల్వలను మార్కెట్లోకి విడుదల చేయనున్న కేంద్రం                             


ఉల్లి నిల్వ‌ల విడుద‌లపై విధివిధానాల‌ను ఖ‌రారు చేశారు. దేశ‌వ్యాప్త స‌గ‌టు కంటే ఉల్లి రిటైల్ ధ‌ర‌లు అధికంగా ఉన్న ప్రాంతాలు, కీల‌క మార్కెట్లు ల‌క్ష్యంగా ఉల్లి నిల్వ‌ల‌ను విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించామ‌ని ఆహార మంత్రిత్వ శాఖ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఈ-వేలం, ఈ-కామ‌ర్స్ ప్లాట్‌ఫాంల‌పై రిటైల్ సేల్స్ ద్వారా మిగులు నిల్వ‌ల‌ను విడుద‌ల చేయ‌డంపైనా క‌స‌ర‌త్తు సాగిస్తున్నామ‌ని పేర్కొంది.


పెరుగుతున్న ఉల్లి ధరల నియంత్రణకు ప్రత్యేక చర్యలు


2022-23లో సీజ‌న్‌లో కేంద్రం 2.51 ల‌క్ష‌ల ట‌న్నుల ఉల్లిని మిగులు నిల్వ‌ల కింద నిర్వ‌హించింది. స‌ర‌ఫ‌రాలు త‌గ్గి ధ‌ర‌లు అమాంతం ఎగ‌బాకితే ధ‌ర‌ల స్ధిరీక‌ర‌ణ కోసం ప్ర‌భుత్వం మిగులు నిల్వ‌ల‌ను సిద్ధం చేస్తుంది. నాఫెడ్‌, ఎన్‌సీసీఎఫ్ స‌హా ప‌లు వ్య‌వ‌సాయ మార్కెటింగ్ సంస్ధ‌ల ఎండీల‌తో  చర్చించిన కేంద్రం మిగులు నిల్వ‌ల నుంచి ఉల్లిని మార్కెట్‌లోకి విడుద‌ల చేస్తున్నారు. 


ఎన్నికల సమయంలో నిత్యావసర ధరలు పెరగకుండా జాగ్రత్తలు 


ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. ముందు జాగ్రత్తగా  బియ్యం ఎగుమతుల్ని నిషేధించింది. అయితే అకాల వర్షాల కారణంగా కూరగాయల ధరలు ఇబ్బంది పెట్టాయి. ఎన్నికల సమయంలో ఇలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా ఉండేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది.  రిజర్వ్ చేసిన  వాటిని మార్కెట్లోకి విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకుంటోంది.