Center has refused to grant permission for the Banakacharla project : బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కేంద్రం ఏపీ సర్కార్‌కు షాక్ ఇచ్చింది. పర్యావరణ అనుమతులు ఇచ్చేందుకు నిరాకరించింది. గోదావరి-పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టు పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిన ప్రాథమిక రిపోర్టును పరిశీలించిన కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ పలు అంశాలపై అభ్యంతరాలును వ్యక్తం చేసింది. బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమని .. ప్రాజెక్టుపై అనేక అభ్యంతరాలు వచ్చాయని తెలిపింది.
బనకచర్ల ప్రాజెక్టులు అనుమతులు ఇవ్వాలంటే గోదావరి జీడబ్ల్యూడీటీ అవార్డు పరిశీలించాల్సి ఉందని కమిటీ తెలిపింది. పర్యావరణ అనుమతులకు సెంట్రల్ వాటర్ కమిషన్‌ను సంప్రదించడం అత్యవసరమని ఏపీకి సమాచారం ఇచ్చింది. ఈ ప్రాజెక్టు జీడబ్ల్యూడీటీ తీర్పు ఉల్లంఘించినట్లవుతుందని ఫిర్యాదులు వచ్చాయని వాటన్నింటినీ పరిశీలించాల్సి ఉందని తెలిపింది. ఏపీ తమ ప్రతిపాదనలు, డీపీఆర్‌ను సీడబ్ల్యూసీకి సమర్పిస్తే.. అన్ని అంశాలపై పరిశీలన చేసి అనుమతులు ఇవ్వాలా లేదా అన్నది నిర్ణయం తీసుకునే అవకాశం ఉది.
గోదావరి వరద నీరు సముద్రంలోకి వందల టీఎంసీలు పోతున్నాయని వాటిని రాయలసీమకు మళ్లించుకుంటామని చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ అంశంపై తెలంగాణలో రాజకీయం జరిగింది. అనేక ఫిర్యాదులు కేంద్రానికి చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వెళ్లి కేంద్రానికి ఫిర్యాదు చేశారు. చివరికి అనుమతులు ఇవ్వడానికి కేంద్రం ముందుకు రాలేదు.
మరో వైపు బనకచర్లపై మంగళవారం హైదరాబాద్‌లోని డాక్టర్ జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌లో మంత్రి ఉత్తమ్ ఆధ్వర్యంలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమం నిర్వహించునున్నారు. ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టిలతో పాటు మంత్రి వర్గం హాజరుకానుంది. లోకసభ,రాజ్యసభ, శాసనమండలి,శాసనసభ్యులతో పాటు కార్పొరేషన్ చైర్మన్ లు,వివిధ కమిషన్ల చైర్మన్ లు,సభ్యులకు ఆహ్వానం పంపారు. ప్రజాప్రతినిధులందరికి నిజ నిజాలు తెలిపే విదంగా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుందని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మించడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ఏ రకంగా దెబ్బ తింటున్నాయాన్నది సమగ్రంగా వివరించేందుకు ఏర్పాట్లు చేశారు.
బనకచర్లకు అనుమతి నిరాకరించడం హర్షణీయమని జాగృతి అధ్యక్షురాలు కవిత సోషల్ మీడియాలో స్పందించారు.
కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇది తమ విజయం అని ప్రకటించుకున్నారు.