Paytm FASTag Users: కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్‌లపై కీలక ప్రకటన చేసింది. National Highways Authority of India (NHAI) ఫాస్టాగ్ వినియోగదారులకు మార్గదర్శకాలు జారీ చేసింది. Paytm ద్వారా ఫాస్టాగ్‌లు తీసుకున్న వాళ్లు వెంటనే వేరే బ్యాంక్‌లకు బదిలీ చేసుకోవాలని సూచించింది. ఎలాంటి అవాంతరాలు రాకుండా ప్రయాణం సాఫీగా సాగిపోవాలంటే పేటీఎమ్ బ్యాంక్ నుంచి వేరే బ్యాంక్‌కి ఫాస్టాగ్‌ని బదిలీ చేసుకోవాలని వెల్లడించింది. మార్చి 15వ తేదీలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా Paytm Payments Bankపై విధించిన ఆంక్షలకు అనుగుణంగా నడుచుకోవాలని వివరించింది. మార్చి 15వ తేదీ తరవాత పేటీఎమ్ బ్యాంక్ ద్వారా ఫాస్టాగ్‌లు రీఛార్జ్ చేసుకోడానికి కానీ...వినియోగించుకోడానికి కానీ వీలుండదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న బ్యాలెన్స్ మాత్రం మార్చి 15లోగా వినియోగించుకోవచ్చని తెలిపింది. అయితే..Paytm FASTag కి సంబంధించి ఏదైనా సమాచారం కావాలంటే సంబంధిత బ్యాంక్‌లను సంప్రదించాలని సూచించింది. లేదంటే IHMCL వెబ్‌సైట్‌లో FAQలు అందుబాటులో ఉన్నాయని, అక్కడ అన్ని వివరాలు తెలుసుకోవచ్చని వెల్లడించింది. జాతీయ రహదారులపై ప్రయాణించే సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే ఇలా అప్రమత్తం చేస్తున్నట్టు NHAI స్పష్టం చేసింది.
ఆ జాబితా నుంచి పేటీఎమ్ ఔట్..
ఇప్పటికే ఫాస్టాగ్‌లు జారీ చేసే బ్యాంక్‌ల జాబితా నుంచి పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్‌ని తొలగించారు. పేటీఎమ్ బ్యాంక్‌కి బదులుగా ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ICICI బ్యాంక్ తదితర బ్యాంక్‌లను చేర్చింది. ఇప్పటికే పేటీఎమ్ ఫాస్టాగ్ కోసం సెక్యూరిటీ డిపాజిట్ చేసిన వాళ్లు రీఫండ్‌కి రిక్వెస్ట్ పెట్టుకోవాలని తెలిపింది. కస్టమర్ సర్వీస్‌ని సంప్రదించి ఈ ప్రక్రియని పూర్తి చేయాలని తెలిపింది. పేటీఎమ్ ద్వారా ఫాస్టాగ్‌లు జారీ చేయొద్దని IHMCL ఆదేశాలు జారీ చేసింది. పేటీఎమ్ నుంచి ఫాస్టాగ్‌ని తొలగించాలని తేల్చి చెప్పింది. ఇప్పటి వరకూ ఈ సర్వీస్‌లు అందించేందుకు పేటీఎమ్‌కి అవకాశమిచ్చిన సంస్థ ఇప్పుడు ఆ లిస్ట్ నుంచి తొలగించింది. టాప్‌అప్స్,డిపాజిట్స్ స్వీకరించకూడదని ఆదేశాలు జారీ చేసింది. IHMCL పరిధిలో మొత్తం 32 బ్యాంకులున్నాయి. వీటి ద్వారా ఫాస్టాగ్ జారీ చేసేందుకు అవకాశముంది. ఇకపై ఈ జాబితాలో పేటీఎమ్ కనిపించదు.
ప్రత్యామ్నాయాలు ఇవే..
జనవరి 31వ తేదీన RBI పేటీఎమ్ బ్యాంక్‌పై ఆంక్షలు విధించింది. అంతర్గతంగా మనీ లాండరింగ్ జరిగిందని, భారీ అవతవకలు జరిగాయని తేల్చి చెప్పింది. వీటిని సరి చేసుకోవాలి ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకూ ఈ ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించింది. దీనిపై ఇప్పటికే ఈడీ దర్యాప్తు మొదలైంది. ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ ఆంక్షల్ని పొడిగించింది. ఈ క్రమంలోనే ఫాస్టాగ్ సర్వీస్‌లనూ నిలిపివేసింది. అందుకే...ఇకపై వాహనదారులు ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిందే. పేటీఎమ్ కాకుండా ఇతర బ్యాంక్‌లు కూడా ఈ సేవలని అందిస్తున్నాయి.
Also Read: ABP Cvoter Opinion Poll 2024: ఆ రాష్ట్రాల్లో బీజేపీదే హవా - ABP CVoter ఒపీనియన్ పోల్ అంచనాలివే