Manish Sisodia Arrest:


కంప్యూటర్ సీజ్..


ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేసే ముందుకు సీబీఐ చేతికి కీలక ఆధారాలు చిక్కినట్టు సమాచారం. సిసోడియా కంప్యూటర్‌ నుంచి డిలీట్ చేసిన ఫైల్స్‌ని రిట్రీవ్ చేసినట్టు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన కీలక ఆధారాలన్నింటినీ సిసోడియా చెరిపేశారని ఆరోపిస్తున్న CBI మొత్తానికి వాటిని రిట్రీవ్ చేసింది. ఈ ఏడాది జనవరిలో ఆయన కంప్యూటర్‌ను సీజ్ చేసింది. కొన్ని ఫైల్స్‌ను డిలీట్ చేసినట్టు గుర్తించిన అధికారులు వెంటనే ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. డిలీట్ చేసిన ఫైల్స్‌ను రికవరీ చేసిన ఫోరెన్సిక్ విభాగం...ఆ వివరాలను CBI అధికారులకు అందించింది. కొంత డేటాతో పాటు ఫైల్స్‌ పంపింది. వీటిని ముందుగా వాట్సాప్‌లో పంపారని, ఆ తరవాతే కంప్యూటర్‌లో సేవ్ చేశారని వెల్లడించింది. తరవాత వీటిని తొలగించినట్టు నిర్ధరించింది. సిసోడియా కార్యాలయంలోని ఈ కంప్యూటర్‌ను స్వాధీనం చేసుకుంది. సీఆర్‌పీసీ సెక్షన్ 91 ప్రకారం ఛార్చ్‌షీట్ దాఖలు చేసింది సీబీఐ. అయితే...ఈ కేసుకి సంబంధించి సప్లమెంటరీ ఛార్జ్‌షీట్‌ను ఫైల్ చేసే పనిలో ఉంది దర్యాప్తు సంస్థ. మరిన్ని ఆధారాలు సేకరిస్తే కేసు స్ట్రాంగ్‌ అవుతుందని భావిస్తోంది. ఇప్పటికే సీబీఐ సిసోడియాను రౌజ్ అవెన్యూ కోర్ట్‌కు తరలించింది. 


 










ఆప్ ఆందోళన..


మనీశ్ సిసోడియా అరెస్ట్‌పై ఆప్ తీవ్రంగా మండి పడుతోంది. పలు రాష్ట్రాల్లో కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతోంది. ఛండీగఢ్, ఢిల్లీ, భోపాల్‌లో ఆందోళనలు చేస్తున్నారు. బీజేపీ కార్యాలయాల ఎదురుగా ఆప్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. కనీసం 200 మంది కార్యకర్తలతో ఆందోళనలు చేపట్టాలని స్థానిక నేతలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇది బ్లాక్‌ డే అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.