CBI Ex JD Laxmi Narayana: ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు వస్తాయనే నమ్మకం తనకు లేదని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నియోజక వర్గంలో ఆయన పర్యటించారు. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రక్రియలో సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. అత్యధిక మంది ఓటింగ్ లో పాల్గొనే విధంగా  పోలింగ్ ఒకే రోజు కాకుండా పలు రోజులు పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి  ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా పరిపాలనపై దృష్టి పెట్టే విధంగా సంస్కరణలు తీసుకురావాలని సూచించారు. ఆంధ్ర ప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు  వస్తాయని తాను భావించడం లేదని చెప్పారు. అలాగే ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు ఏ ప్రభుత్వమైనా ఐదేళ్లు పరిపాలించాలని సూచించారు. ప్రతీ ఒక్క ప్రాంతాన్ని రాష్ట్రంగా విభజిస్తూ పోతే అభివృద్ధి జరగదని అన్నారు. 


 ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక కూడా ఉందని జేడీ లక్ష్మీ నారాయణ వెల్లడించారు. రాష్ట్రంలో 26 జిల్లాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రణస్థలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించిన సభలో యువకులు ముందుకు వచ్చి తమ గళాన్ని వినిపించడం చాలా సంతోషదాయకం అన్నారు. పవన్ కళ్యాణ్ పొత్తులపై కూడా స్పష్టత ఇచ్చారని తెలిపారు. రణస్థలంలో రణానికి స్థలాన్ని కూడా పవన్ కల్యాణ్  నిర్దేశించారని వెల్లడించారు.