NEET Paper Leak Case: నీట్‌ పేపర్ లీక్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పేపర్‌ లీక్‌తో సంబంధం ఉన్న జర్నలిస్ట్‌ని సీబీఐ అరెస్ట్ చేసింది. జార్ఖండ్‌లోని హజరిబాగ్‌లో అధికారులు అరెస్ట్ చేశారు. జర్నలిస్ట్‌ జమాలుద్దీన్‌ ఓ హిందీ పేపర్‌లో పని చేస్తున్నాడు. అంతకు ముందు ఇదే కేసులో అరెస్ట్ అయిన ఇద్దరు నిందితులకు జమాలుద్దీన్ సహకరించినట్టు విచారణలో తేలింది. అంతా కుమ్మక్కై పేపర్ లీక్ చేశారని వెల్లడైంది. అరెస్ట్ అయిన వారిలో ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ ఉన్నారు. వీళ్లతో పాటు మరో ఐదుగురిని అధికారులు విచారిస్తున్నారు. పూర్తి స్థాయిలో సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అటు గుజరాత్‌లోనూ సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తంగా 7 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. జూన్ 27వ తేదీన CBI ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసింది. పట్నాకు చెందిన ఇద్దరు యువకులు పేపర్‌ని లీక్‌ చేసేందుకు సహకరించారు. డబ్బులు కట్టిన అభ్యర్థులకు నీట్ ఎగ్జామ్‌ పేపర్‌తో పాటు ఆన్సర్ కీ ఇవ్వడంలో సాయపడ్డారు. ఎక్కడికి వెళ్లి ఆ పేపర్‌లు తెచ్చుకోవాలో గైడ్ చేశారు. అంతకు ముందు వరకూ పోలీసుల పరిధిలో ఉన్న ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వెంటనే ఈ కేసుని CBIకి బదలీ చేస్తున్నట్టు ప్రకటించింది. అప్పటి నుంచి సీబీఐ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. జూన్ 23వ తేదీన FIR నమోదు చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై విచారణ చేపడుతున్నారు.