అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్‌ను భారత దేశం గర్వించే వ్యక్తిగా పేర్కొంటూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించింది. అయితే ఇలా ప్రకటించిన ఒక్క రోజుకే ఇండియాలో ఆయనపై కేసు నమోదయింది. కోర్టు ఆదేశాల మేరకు ముంబై పోలీసులు పిచాయ్‌తో పాటు ఐదుగరు కంపెనీ ప్రతినిధులపైనా కేసు బుక్‌ చేసి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కాపీరైట్‌ యాక్ట్‌ వయొలేషన్‌ కింద ఈ కేసు నమోదు అయింది. 



 


"ఏక్‌ హసీనా థీ ఏక్‌ దివానా థా" అనే సినిమాను కొంత మంది యూట్యూబ్‌లో అప్ లోడ్ చేశారు. ఈ సినిమా దర్శక, నిర్మాత అయిన సునీల్‌ దర్శన్‌ అక్రమంగా అప్ లోడ్ చేశారని.. రైట్స్ ఎవరికీ విక్రయించలేదని కోర్టును ఆశ్రయించారు. ఇందులో గూగుల్ కంపెనీ ప్రతినిధుల పేర్లను ప్రతివాదులుగా చేర్చారు. తన సినిమా హక్కుల్ని ఎవరికీ అమ్మలేదని, అలాంటిది యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయడం ద్వారా తనకు నష్టం వాటిల్లిందని సునీల్‌ కోర్టులో వాదించారు. ఇల్లీగల్‌ అప్‌లోడింగ్‌ విషయంలో యూట్యూబ్‌కు ఎన్ని ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. దానికి సంబంధించిన ఆధారాలు సమర్పించారు. విచారణ తర్వాత కోర్టు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఆదేశించింది. 


ఏక్‌ హసీనా థీ ఏక్‌ దివానా థా 2017లో రిలీజ్‌ అయ్యింది. ఈ సినిమాలో పేరున్న నటులు ఎవరూ లేరు. సినిమా మొత్తాన్ని లండన్‌లో చిత్రీకరించారు.  సహజంగానే ఈ సినిమా వచ్చింది.. వెళ్లింది అన్న సంగతి కూడా ఎవరికీ తెలియదు.  యూట్యూబ్‌లో పెట్టినా చూసేవాళ్లు లేరు. కానీ సునీల్ దర్శన్ మాత్రం కోర్టుకెక్కారు. చివరికి గూగుల్ సీఈవోకి కూడా నోటీసులు వెళ్లేలా చేయగలిగారు. అయితే ఇదంతా సునీల్ దర్శన్ పబ్లిసిటీ కోసం చేస్తున్నారన్న కామెంట్లు కూడా ఎక్కువే వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌లో ప్రచారం కోసం ఇలాంటి పనులు చేస్తూంటారని అంటున్నారు. మొత్తానికి  నిన్న పద్మభూషణ్ పురస్కారం..ఇవాళ కేసు ... ఈ రెండూ  సుందర్ పిచాయ్‌కు కట్టా..మీఠా టైపులో ఉంటాయని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.