Mumbai Gets Bomb Threat: 


ఆగంతకుడి ఫోన్ కాల్..


కొత్త సంవత్సర వేడుకలకు ముంబయి నగరమంతా సిద్ధమవుతున్న సయయంలో బాంబు బెదిరింపులు ఒక్కసారిగా అలజడి సృష్టించాయి. గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు కాల్ చేసి ముంబయిలో పలు చోట్ల బాంబులు పెట్టినట్టు బెదిరించాడు. డిసెంబర్ 30న సాయంత్రం 6 గంటలకు ముంబయి పోలీస్ కంట్రోల్ రూమ్‌కి ఈ ఫోన్ కాల్ వచ్చింది. "ముంబయిలో వరుస బాంబు పేలుళ్లకి సిద్ధం కండి" అని చెప్పి కాల్ కట్ చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు పలు చోట్ల తనిఖీలు నిర్వహించారు. ఇప్పటి వరకూ ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. ఆ ఫోన్‌ కాలర్‌ని ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే నగరమంతా భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసులకు కాల్‌తో పాటు ఆగంతకులు మెయిల్‌ కూడా చేశారు. పలు చోట్ల బాంబు పేలుళ్లు జరుగుతాయని బెదిరించారు. అంతే కాదు. RBI గవర్నర్ శక్తికాంత దాస్‌తో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఇదంతా ఓ ప్రాంక్‌కాల్ అని గుర్తించారు. ఈ కేసులో వడోదర, గుజరాత్‌లోని ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. కొత్త సంవత్సర వేడుకల్లో ఎలాంటి ఆందోళనలు జరగకుండా ముంబయి నగరంలో దాదాపు 15 వేల మంది పోలీసులు మొహరించారు. దీంతో పాటు ముంబయి ట్రాఫిక్ పోలీసులూ అన్ని చోట్లా ఏర్పాట్లు చేశారు. ఎక్కడా రద్దీ ఎక్కువగా కాకుండా జాగ్రత్త పడుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. కీలకమైన ప్రాంతాల్లో దాదాపు 5 వేల CC కెమెరాలు ఏర్పాటు చేశారు. 121 ప్రాంతాల్లో నాకాబందీ నిర్వహించనున్నారు. ఎక్కువ రద్దీ ఉండే చోట్ల ప్రధానంగా ఫోకస్ చేయనున్నారు.