One Month Wage For First Time Employees: కొత్త ఉద్యోగులకు సంబంధించి కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఉద్యోగాల కల్పనపై దృష్టి సారిస్తున్నట్టు వెల్లడించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓ ప్రకటన చేశారు. మొట్ట మొదటి సారి ఉద్యోగంలో చేరిన వారికి నెల జీతాన్ని PFలో జమ చేయనుంది. రూ. లక్ష లోపు జీతం ఉన్న వాళ్లు ఈ స్కీమ్‌కి అర్హులు అని వెల్లడించింది. అయితే...గరిష్ఠంగా రూ.15 వేలు మాత్రమే PFలో జమ చేస్తామని స్పష్టం చేసింది. ఈ స్కీమ్ ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 2.1 కోట్ల మంది యువతకు లబ్ధి చేకూరుతుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అంతే కాదు. ఉద్యోగంలో చేరిన నాలుగేళ్ల వరకూ అటు ఉద్యోగితో పాటు కంపెనీకి కూడా లబ్ధి చేకూరేలా కీలక ప్రకటన చేశారు. 


మరో కీలక విషయం కూడా వెల్లడించారు. ఈ స్కీమ్‌లో భాగంగా రూ.లక్ష జీతం వరకూ ఓ కంపెనీ కొత్తగా ఎంత మంది ఉద్యోగులను తీసుకుంటే ఆ ఎంప్లాయ్‌పై కంపెనీ చెల్లించాల్సిన PFలో కేంద్రం రూ.3 వేల వరకూ రీఎంబర్స్ చేయనుంది. అంటే...కొత్తగా ఎంత మంది ఉద్యోగులను తీసుకున్నా ఆ ఎంప్లాయ్‌కి ఈ స్కీమ్ వర్తిస్తుంది. తద్వారా కంపెనీకి కొంత వరకూ భారం తగ్గుతుంది. అదే సమయంలో సంస్థలు భారీ మొత్తంలో ఉద్యోగాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపించే అవకాశమూ ఉంటుందని కేంద్రం అభిప్రాయపడింది. దాదాపు రెండేళ్ల పాటు ఈ స్కీమ్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. అన్ని రంగాల్లోని ఉద్యోగులకూ ఇది వర్తిస్తుందని తెలిపింది.