కర్ణాటక సీఎం, భాజపా సీనియర్ నేత యడియూరప్ప రాజీనామా చేయడం దాదాపు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. హస్తిన పర్యటనలో ఉన్న యడియూరప్ప ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు. రాష్ట్రంలో జరిగే ఎలాంటి రాజకీయ మార్పులపైనా పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు ఆందోళన చేయొద్దని ఆయన కోరారు. ఈ మాటలతో ఆయన రాజీనామాపై ఉన్న సందేహాలు తీరిపోయాయి.
యడియూరప్ప హస్తిన పర్యటనతో ఆయన రాజీనామాపై వార్తలు మరోసారి గుప్పుమన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సహా పార్టీ అధిష్ఠాన పెద్దలతో వరుస భేటీలతో ఈ వార్తలకు ప్రాధాన్యం చేకూరింది. కర్ణాటక భాజపాలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత విభేదాలు కొద్ది నెలలుగా బహిర్గతం కావడం ఆయనకు పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారింది.
ఒకవేళ సీఎంను మార్చాల్సి వస్తే మాత్రం జూలై 26 కల్లా (సీఎంగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తవుతాయి) కర్ణాటకలో నాయకత్వ మార్పు జరిగే అవకాశం ఉన్నట్టు యడియూరప్ప మాటలతో అర్థమవుతుంది.
సొంత పార్టీలోనే అసమ్మతి జ్వాల
యడియూరప్పకు వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా సొంత పార్టీలోనే కొందరు నేతలు అసమ్మతి గళం వినిపిస్తున్నారు. దీంతో నాయకత్వ మార్పు తప్పదంటూ పలుమార్లు వార్తలు వచ్చినా అధిష్ఠానం జోక్యంతో మళ్లీ అవి సద్దుమణిగినట్టు కనబడుతున్నాయి. ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్, పర్యాటక శాఖ మంత్రి సీపీ యోగేశ్వర్, ఎమ్మెల్యే ఏహెచ్ విశ్వనాథ్ ఇటీవల యడియూరప్ప, ఆయన కుమారుడు విజయేంద్రపై అవినీతి ఆరోపణలు చేయడంతో పాటు రాజీనామాకు డిమాండ్ చేశారు. అయితే పార్టీ అధిష్ఠానం జోక్యంతో ఈ అసమ్మతి సద్దుమణిగింది. కానీ యడియూరప్ప రాజీనామా చేయడానికి సిద్ధమైనట్లు కనిపిస్తోంది.