KTR Vs Siddaramaiah Twitter War : బీఆర్ఎస్ (BRS), కర్ణాటక (Karnataka) కాంగ్రెస్(Congress) నేతల మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి. సోషల్ మీడియా (Social Media )వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (KTR), కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah)లు ఎక్స్ వేదికగా డైలాగ్ వార్ జరుగుతోంది. కర్ణాటక,తెలంగాణలో హస్తం పార్టీ ఇచ్చిన హామీలపై నేతల మధ్య పంచ్ లు పేలుతున్నాయి. కేటీఆర్, సిద్ధరామయ్య గొడవలోకి మంత్రి ప్రియాంక్ ఖర్గే ఎంటరయ్యారు. అబద్ధాలు, అవకతవకల చెప్పడంలో  బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, కమలం పార్టీ నేతలను అనుసరిస్తున్నారని విమర్శించారు. కాషాయ, కారు పార్టీలు...తోడు దొంగలుగా మారాయన్నారు. ఆ రెండు పార్టీలు అబద్దాలను ప్రచారం చేయడంలో ముందుంటాయని, ఇలాంటివి వారికి నిత్యకృత్యమేనని మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చేసే ఫేక్ న్యూస్, ప్రచారాలను తిప్పికొట్టడానికి ప్రత్యేకంగా కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తుందన్నారు. 


ప్రియాంక్ ఖర్గే కామెంట్స్ పై మాజీ మంత్రి కేటీఆర్ తన స్టైల్ లో తిప్పి కొట్టారు. హాయ్‌ ప్రియాంక్‌ గారు. మీరు కూడా ఈ ఇష్యూలో తలదూర్చాలని నిర్ణయించుకున్నందుకు సంతోషం. మీ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ... కర్ణాటక యువతకు 2 లక్షల ఉద్యోగాలిస్తామని చేసిన ప్రకటన చేశారు. మీ డిప్యూటీ సీఎం ఖజానా ఖాళీగా ఉందని చేసిన ప్రకటనలు కూడా తప్పుడువేనా ? అని ప్రశ్నించారు. తెలంగాణలో ముగ్గురు ఎంపీలు సహా బీజేపీ పెద్ద తలకాయలన్నింటిని ఓడించింది మేమే ఫ్రెండ్. హస్తం పార్టీ కాదు. సునీల్ అండ్‌ టీమ్‌ ప్రచారంపై మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది అంటూ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. 


డిసెంబర్‌ 9న ఎన్నికల హామీలు అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు చేసిన ప్రకటనలు ఏమయ్యాయని కేటీఆర్ ప్రశ్నించారు. డిసెంబర్‌ తొమ్మిది దాటి పది రోజులు గడిచినా...మీ పార్టీ ఇచ్చిన హామీలు ఇంతవరకూ నెరవేరలేదని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ఇచ్చిన ఒక్కో హామీపై ప్రశ్నలు సంధించారు. ఈ వ్యవహారంలోకి కాంగ్రెస్‌ నేత ప్రియాంక్‌ ఖర్గే ఎంటరవడంతో....కేటీఆర్‌  కౌంటర్‌ ఇచ్చారు. సిద్ధరామయ్య అసెంబ్లీలో మాట్లాడినట్లు ఉన్న వీడియోను కేటీఆర్ పోస్టు చేశారు. ఆ వీడియోలో ఎన్నికల్లో ఓట్ల కోసం అది ఇస్తాం, ఇది ఇస్తామని సిద్ధరామయ్య అన్నట్లు వీడియోలో ఉంది. అన్ని ఇస్తామని చెప్పినంత మాత్రాన అన్నీ ఫ్రీగా ఇవ్వా లా ? మాకు ఇవ్వాలనే ఉందని, అయితే  ఖజానాలో డబ్బులు లేవన్నారు. వీటికి తోడు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఎంపీ రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీల వీడియోలు, పేపర్‌ క్లిప్పింగ్‌లను ఎక్స్ లో పోస్ట్‌ చేశారు. కేటీఆర్ ట్వీట్లకు సిద్ధరామయ్య కౌంటర్ ఇచ్చారు. కనీసం మీరు ఏవీ ఫేక్‌ వీడియోలు, ఎడిటెడ్‌ వీడియోలో గుర్తించలేకపోతున్నారని మండిపడ్డారు. బీజేపీ ఫేక్‌, ఎడిటెడ్‌ వీడియోలను క్రియేట్ చేస్తే, వాటిని  మీ పార్టీ వైరల్‌ చేస్తోందన్నారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి పర్‌ఫెక్ట్‌ బీ టీమ్‌ అని,  వాస్తవాలు తెలుసుకోవాలనుకుంటే గతంలో బీజేపీ నాయకులు సృష్టించిన ఫేక్‌, ఎడిటెడ్‌ వీడియోలపై తన ప్రకటన చూడాలంటూ సిద్ధరామయ్య సెటైర్లు వేశారు.