KTR Comments On By Elections: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు బీఆర్ఎస్ (BRS) ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు ఢిల్లీలోని పలువురు ప్రముఖ న్యాయ కోవిదులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సహా సీనియర్ నాయకుల బృందం సోమవారం చర్చలు జరిపింది. అటు రాజ్యాంగ నిపుణులతోనూ పార్టీ ప్రతినిధి బృందం సమావేశమై చర్చించింది. పార్టీ ఫిరాయింపుల విషయంలో మణిపూర్‌కు సంబంధించి ఎమ్మెల్యే సహా సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చిందని రాజ్యాంగ నిపుణులు బీఆర్ఎస్ బృందానికి తెలిపారు.


గతంలో మాదిరిగా పార్టీ మారే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే విషయంలో సుదీర్ఘ కాలం పాటు నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ నాన్చలేరని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి హైకోర్టులో వేసిన పిటిషన్‌తో పాటు, పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన స్పీకర్‌కు చేసిన ఫిర్యాదు విషయాన్ని, వాటికి సంబంధించిన పత్రాలను న్యాయ నిపుణులకు బీఆర్ఎస్ నేతలు అందించారు. ఈ విషయంలో ప్రస్తుతం సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నందున హైకోర్టు సైతం ఎక్కువ కాలం వాయిదా వేసే అవకాశం లేదని న్యాయ నిపుణులు తెలిపారు. హైకోర్టు నిర్ణయం త్వరగా ప్రకటించకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉందన్నారు.  


'త్వరలోనే ఉప ఎన్నికలు'


తెలంగాణలో త్వరలోనే ఉప ఎన్నికలు తప్పవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయిస్తామని అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయనతో పాటు ఎమ్మెల్యే హరీష్ రావు ఇతర ఎమ్మెల్యేల బృందం న్యాయ నిపుణులతో సోమవారం సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సుప్రీంకోర్టు తీర్పులతో పాటు న్యాయ కోవిదులు, రాజ్యాంగ నిపుణుల సూచనల మేరకు న్యాయపోరాటం కొనసాగిస్తామన్నారు. 'ఈ అంశంపై త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో నెల రోజుల్లోనే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం తేలిపోతుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తాం. ఓ వైపు జాతీయ స్థాయిలో పార్టీ ఫిరాయింపులపై ముచ్చట్లు చెబుతూ తెలంగాణలో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది. న్యాయస్థానాల సహకారంతో కాంగ్రెస్‌కు సరైన గుణపాఠం చెబుతాం' అని కేటీఆర్ స్పష్టం చేశారు. కాగా, రాజ్యాంగ నిపుణులు, న్యాయ కోవిదులతో జరిగిన సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు, జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యులు వద్ధిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సహా పార్టీ నాయకులు పాల్గొన్నారు.


'ఇదేనా ఇందిరమ్మ పాలన.?'


షాద్ నగర్‌లో దళిత మహిళపై పోలీసుల దాడిని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. 'దళిత మహిళపై ఇంత దాష్టీకమా.?' అంటూ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఇదేనా ఇందిరమ్మ పాలన.? ఇదేనా ప్రజాపాలన? దొంగతనం ఒప్పుకోవాలంటూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా.?' అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ప్రజలను రక్షించాల్సిన పోలీసుల దగ్గరే రక్షణ లేని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. బాధిత మహిళకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.


Also Read: Telangana : తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి- ప్రవాస పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ పిలుపు