BRS leaders criticizing Pawan On Evileye comments : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోనసీమలో చేసిన 'దిష్టి' వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి జిల్లాల పచ్చదనమే రాష్ట్ర విభజనకు కారణం. దిష్టి కోనసీమపై తగిలి, కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి అంటూ బుధవారం పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో పవన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఏపీ ప్రభుత్వం నిర్వహించిన 'పల్లె పండుగ 2.0' కార్యక్రమం బుధవారం ఈస్ట్ గోదావరి జిల్లా రాజోలులో జరిగింది. రైతుల సమస్యలు, పశుసంవర్ధన, వ్యవసాయ సాంకేతికతలపై చర్చలు జరిగిన ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొని, కోనసీమ కొబ్బరి రైతులతో మాట్లాడారు. "పచ్చని కోనసీమను చూసి తెలంగాణ నేతలు ఈర్ష్య పడ్డారు. ఆ పచ్చదనమే రాష్ట్ర విభజనకు ఒక కారణం. నరుడు దిష్టికి నల్ల రాయి కూడా బద్దలై పోతుంది, కోనసీమ కొబ్బరి చెట్లకు కూడా అదే జరిగింది" అంటూ వ్యాఖ్యలు చేశారు.
పవన్ వ్యాఖ్యలకు తెలంగాణ BRS ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తీవ్ర కౌంటర్ ఇచ్చారు. సూర్యాపేటలో పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ, కోనసీమకు తెలంగాణ దిష్టి తగలడానికి అక్కడికి వెళ్లి ఎవరు చూస్తున్నారని.. అక్కడ నుంచి హైదరాబాద్‌కు భారీగా వస్తున్నారన్నారు. భారీ సంఖ్యలో వచ్చి మనపై దిష్టి పెడుతున్నారు. ఇలాంటి వాళ్లు నోటిని అదుపు చేసుకోవడం నేర్చుకోకుండానే సీఎం, డిప్యూటీ సీఎం అవుతున్నారు అని మండిపడ్డారు. నర దిష్టి పడిందంటాం, ఓ చేను వెంట వెళ్తుంటే బాగుంది చేను అంటారనుకొని చేనులో దిష్టిబొమ్మలు పెట్టుకుంటారు. అలాగే అక్కడ దిష్టిబొమ్మలు పెట్టుకోవాలి, ఎవరు వద్దంటారు, ఆ స్థాయిలో ఉండి మాట్లాడేవారు కనీసం సోయి తెచ్చుకొని మాట్లాడాలని పవన్ కల్యాణ్‌కు సూచించారు.