Division Bench suspends single bench verdict in 2019 Group 2 issue : తెలంగాణ హైకోర్టులో గ్రూప్-2 2019 ర్యాంకర్లకు గురువారం భారీ ఊరట లభించింది. 2019 సెలెక్షన్ లిస్ట్‌ను రద్దు చేస్తూ నవంబర్ 18న సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. మెరిట్ లిస్ట్ చెల్లదని ప్రకటించిన సింగిల్ బెంచ్ ఆదేశాలను నిలిపివేసి ర్యాంకర్లకు తాత్కాలిక రక్షణ అందించింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసిన డివిజన్ బెంచ్, ఈ కేసులో మరిన్ని వాదనలు వినాలని నిర్ణయించింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) 2015లో 1,032 గ్రూప్-2 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. 2016 నవంబర్‌లో జరిగిన పరీక్షల ఫలితాలు 2019 అక్టోబర్ 24న విడుదలయ్యాయి. అయితే, ఈ ఫలితాలపై తీవ్ర వివాదాలు ఏర్పడ్డాయి. ఓఎమ్‌ఆర్ షీట్లలో అవకతవకలు, వైటెనర్ ఉపయోగం, ఎరేసర్ మార్కులు, డబుల్ బబులింగ్ వంటివి జరిగాయని గుర్తించారు. ప్రభుత్వం నియమించిన సాంకేతిక కమిటీ 2017లో ఇలాంటి షీట్లను మూల్యాంకనం చేయకూడదని సిఫారసు చేసింది. కానీ టీజీపీఎస్సీ ఈ మార్గదర్శకాలను పాటించకపోవడంతో, అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ విషయంలో సింగిల్ బెంచ్ జస్టిస్ నాగేష్ భీమపాక నవంబర్ 18న కీలక తీర్పు ఇచ్చారు. 2019 సెలెక్షన్ లిస్ట్‌ను రద్దు చేస్తూ తీరపు ఇచ్చారు. మునుపటి డివిజన్ బెంచ్ తీర్పు , సాంకేతిక కమిటీ సిఫారసులకు అనుగుణంగా పునఃమూల్యాంకనం చేయాలని, అర్హ అభ్యర్థుల జాబితాను విడుదల చేసి నియామకాలు పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ ప్రక్రియను ఎనిమిది వారాల్లో పూర్తి చేయాలని గడువు విధించింది. ఈ తీర్పు 1,032 మంది ఎంపికైన అధికారులకు షాక్‌గా నిలిచింది.
సింగిల్ బెంచ్ తీర్పును సవాలు చేస్తూ, పలువురు ర్యాంకర్లు , టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. గురువారం జరిగిన విచారణలో, డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఆదేశాలను మధ్యంతరంగా సస్పెండ్ చేసింది. మెరిట్ లిస్ట్‌ను తాత్కాలికంగా పునరుద్ధరించడం ద్వారా, ర్యాంకర్లు తమ స్థానాలను కోల్పోకుండా ఉండేలా చేసింది. ఈ మధ్యంతర ఉత్తర్వులు ర్యాంకర్లకు పెద్ద ఊరటగా మారాయి, ఎందుకంటే ఇప్పటికే వారు ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. తదుపరి విచారణను జనవరి మొదటి వారంలో చేపడతారు. రెండు వైపులా వాదనలు మరింత వివరంగా వినాలని, అందరి హక్కులను రక్షించేలా తీర్పు ఇవ్వాలని బెంచ్ సూచించింది. ఈ వివాదం 2019లోనే మొదలైంది. ఓఎమ్‌ఆర్ షీట్లలో పార్ట్-ఎ మాత్రమే మూల్యాంకనం చేయాలని సాంకేతిక కమిటీ సిఫారసు చేసినా, టీజీపీఎస్సీ పార్ట్-బీని కూడా పరిగణలోకి తీసుకుంది. ఇది మునుపటి డివిజన్ బెంచ్ ఆదేశాలకు విరుద్ధమని అభ్యర్థులు వాదించారు.