Revanth Reddy in Davos: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. అక్కడ వివిధ కంపెనీల అధిపతులు, సీఈవోలు, ప్రతినిధులను కలుస్తూ తెలంగాణలోకి పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. అలా బుధవారం (జనవరి 17) రేవంత్ రెడ్డి ఆదానీ గ్రూపు అధిపతి అయిన గౌతమ్ ఆదానీని కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో మొత్తం రూ.12,400 కోట్ల పెట్టుబడులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో అదానీ గ్రూప్ అవగాహన ఒప్పందాలు (MoU) చేసుకుంది.


దీనిపై తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. ఆదానీతో రేవంత్ రెడ్డి ఒప్పందం చేసుకోవడంపై కేటీఆర్ విమర్శలు చేశారు. ఎన్నికలకు ముందు ఆదానీని విపరీతంగా తిట్టిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఆయనతోనే అలయ్ బలయ్ అవుతున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ ఆదానీకి దేశ సంపదను దోచి పెడుతున్నారని రేవంత్ విమర్శలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇవాళ దావోస్‌ సాక్షిగా అదానీతో అలయ్‌ బలయ్‌ చేసుకున్నారని అన్నారు. తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది. సభకు మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, వీ శ్రీనివాస్‌ గౌడ్‌, లక్ష్మా రెడ్డి, కడియం శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.


కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను ప్రజలకు వివరించాలని కేటీఆర్ సూచించారు. ఆరు నెలల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారని, కాంగ్రెస్‌ 420 హామీలను ప్రజలకు ఎప్పుడూ గుర్తు చేయాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఎన్నికలకు ముందు రూ.2 లక్షల రుణమాఫీ ఒకే విడతలో చేస్తామని రేవంత్‌రెడ్డి అన్నారని.. ఇప్పుడు రుణమాఫీ దశలవారీగా చేస్తామని వ్యవసాయ మంత్రి అంటున్నారని గుర్తు చేశారు.


ఆదానీతో రేవంత్ ఒప్పందంలోని అంశాలివీ
తెలంగాణలో అదానీ గ్రీన్ ఎనర్జీ 1350 మెగావాట్ల సామర్థ్యంతో రెండు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేస్తుంది. దీనికి రూ.5 వేల కోట్లు పెట్టుబడి పెడుతుంది. చందన్ వల్లిలో అదానీ కొనెక్స్ (AdaniConneX) డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుంది. 100 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ క్యాంపస్‌ ఏర్పాటుకు రూ.5 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 


ఆదానీ గ్రూపునకు చెందిన అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ రాష్ట్రంలో రూ.1400 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది. ఏడాదికి 6 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో సిమెంట్ గ్రైండింగ్ యూనిట్‌ ఏర్పాటు చేయనుంది. అదానీ ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ పార్క్ లో కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్, క్షిపణి అభివృద్ధి, తయారీ కేంద్రాలకు అదానీ ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ రూ.1,000 కోట్లు పెట్టుబడి పెడుతుంది. ఈ ప్రాజెక్టులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సహాయ సహకారాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదానీకి హామీ ఇచ్చారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం పెట్టుబడిదారులకు స్నేహపూర్వక వాతావరణం కల్పించిందని అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ ఆనంద్ అన్నారు.