British Man Banned:
భూ వివాదం..
ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతుంటాయి. వీటిలో కొన్ని మరీ ఆశ్చర్యంగా అనిపిస్తాయి. అలాంటి సంఘటనే ఒకటి యూకేలో జరిగింది. ఓ వ్యక్తిని తన సొంత గ్రామంలోకి రాకుండా నిషేధం విధించారు. ఇందులో ఏముంది. ఇదంతా కామనే. ఏదో తప్పు చేసుంటాడు. వారం పది రోజుల తరవాత మళ్లీ నార్మల్ అయిపోతుంది అనుకోవచ్చు. కానీ...ఇక్కడ సీన్ వేరు. సొంత గ్రామంలోకి రాకుండా ఎన్నేళ్లు బ్యాన్ చేశారో తెలుసా..? 15 ఏళ్లు. అవును. 2037 వరకూ ఆ వ్యక్తి తన గ్రామంలో అడుగు పెట్టేందుకు వీల్లేదు. ఓ భూ వివాదం వల్ల ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య యూకేలోని Blissworth గ్రామంలో చాన్నాళ్లుగా సరిహద్దు వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే తన పొరుగున ఉన్న వ్యక్తి ఇంట్లోని చెట్లను కట్ చేశాడు మరో వ్యక్తి. అందుకే ఇలా శిక్ష విధించారు. నిందితుడైన 59 ఏళ్ల ఆడ్రియన్ స్టేయర్స్‌కు నార్త్‌హంప్టన్స్ మెజిస్ట్రేట్స్ కోర్ట్ 6 వారాల జైలు శిక్ష కూడా విధించింది. 18 నెలల పాటు సస్పెన్షన్ వేటు కూడా వేసింది. అంతే కాదు. 15 ఏళ్ల పాటు ఆ గ్రామంలోకిఅడుగు పెట్టడానికి వీల్లేదని, అక్కడి వారితో సంబంధాలూ పెట్టుకోకూడదని తేల్చి చెప్పింది న్యాయస్థానం. ఈ శిక్షపై నిందితుడు ఆడ్రియన్ స్పందించాడు. "నేనెవరినైనా హత్య చేశానా..? సంఘ వ్యతిరేక శక్తినా..?" అంటూ అసహనం వ్యక్తం చేశాడు. తనకు 74 ఏళ్ల వయసు వచ్చేంత వరకూ గ్రామంలోకి అడుగు పెట్టకూడదని నిబంధన విధించడంపై ఎంతో అసంతృప్తిగా ఉన్నాడు. పొరపాటున అక్కడికి వెళ్తే జైల్లో పెడతారేమో అని భయ పడుతున్నాడు.
భిన్న వాదనలు..
అయితే...ఆడ్రియన్‌పై పోలీసులు చెప్పే వివరాలన్నీ వేరుగా ఉన్నాయి. 2021 నుంచి ఆడ్రియన్‌పై ఫిర్యాదులు వచ్చాయని, పొరుగింటి వ్యక్తిని పదేపదే ఇబ్బంది పెడుతున్నాడని చెప్పారు. ఇతని ప్రవర్తన వల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్లు సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఇదే విషయాన్ని చాలా మంది ఫిర్యాదు చేశారని పోలీసులు స్పష్టం చేశారు. వివాదాస్పద భూమిలో ఉన్న చెట్లను నరికాడని అందుకే శిక్ష విధించాల్సి వచ్చిందని చెప్పారు. 20 ఏళ్లుగా ఈ చెట్లకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా జాగ్రత్త పడుతున్నారని అన్నారు. కుటుంబ సభ్యులు కానుకలుగా ఇచ్చిన ఈ చెట్లను చాలా జాగ్రత్తగా పెంచుకుంటున్నారని, వాటిని నరికినందుకే అతనిపై కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందని పోలీసులు వివరించారు. కానీ...నిందితుడి వాదన మాత్రం వేరేలా ఉంది. కావాలనే తనపై కక్షగట్టి ఇలా చేస్తున్నారని వాదిస్తున్నాడు. సాధారణంగా కోర్టులు వింత శిక్షలు విధిస్తాయని వినడమే కానీ...ఈ కేసులో ప్రత్యక్షంగా తెలిసొచ్చింది. దాదాపు 15 ఏళ్ల పాటు ఆ వ్యక్తి తన సొంత గ్రామానికి వెళ్లకుండా ఉండడమంటే మాటలు కాదు. మరెప్పుడూ అలాంటి నేరాలు చేయకుండా కట్టడి చేసేందుకే ఈ శిక్ష విధించింది కోర్టు.