British fighter jet remains grounded in Thiruvananthapuram: కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో జూన్ 14, 2025న బ్రిటిష్ రాయల్ నేవీకి చెందిన F-35B లైటనింగ్ II స్టెల్త్ యుద్ధ విమానం అత్యవసర పరిస్థితుల్లో ల్యాండ్ అయింది. ఈ విమానం జూన్ 21, 2025 నాటికి అక్కడే ఉండిపోయింది. ప్రతికూల వాతావరణం కారణంగా అత్యవసరంగా ల్యాండ్ చేయగా ఆ తర్వాత ఫైటర్ జెట్‌లోని హైడ్రాలిక్ సిస్టమ్ ఫెయిలయింది. టర్బైన్ బ్లేడ్స్, ఇంధన పంపులు , ఇతర భాగాలకు నష్టం తలెత్తినట్లు గుర్తిచారు. ఈ సమస్యలను సరిచేయడానికి బ్రిటిష్ నేవీ నుండి మొదటి బృందం ప్రయత్నించినప్పటికీ విఫలమైంది. అమెరికన్ తయారీదారు లాక్‌హీడ్ మార్టిన్ నుండి ఇంజనీర్ల బృందం వచ్చిదాన్ని బాగు చేయాల్సి ఉంది.
F-35B అత్యాధునిక స్టెల్త్ టెక్నాలజీ, సెన్సార్ ఫ్యూజన్ సిస్టమ్స్, షార్ట్ టేకాఫ్, వర్టికల్ ల్యాండింగ్ (STOVL) సామర్థ్యాలతో కూడిన విమానం. బ్రిటన్ ఈ సాంకేతిక రహస్యాలు బయటపడకుండా జాగ్రత్త తీసుకుంటోంది. భారత్ విమానాన్ని ఎయిర్ ఇండియా హ్యాంగర్‌కు తరలించేందుకు సహకారం అందించినప్పటికీ, బ్రిటిష్ నేవీ దానిని బహిరంగంగా ఉంచాలని నిర్ణయించింది, ఎందుకంటే హ్యాంగర్‌లో భారత సాంకేతిక నిపుణులు విమానం సున్నితమైన సాంకేతికతను పరిశీలించే అవకాశం ఉందని అనుమానం చెందుతోంది.
విమానం ఇంజన్ , హైడ్రాలిక్ సిస్టమ్‌లోని సమస్యల కారణంగా, స్థానికంగా మరమ్మతు చేయడం సాధ్యపడలేదు. బ్రిటన్ నుండి అదనపు సాంకేతిక బృందం , విడిభాగాలు A400 సైనిక రవాణా విమానంలో వచ్చాయి, కానీ భారీ వర్షాల వల్ల మరమ్మతులు సాధ్యం కావడం లేదు. హ్యాంగర్ కు తరలిస్తే మరమ్మతులు చేయవచ్చు. కానీ దానికి బ్రిటన్ సైనికాధికారులు సిద్దంగా లేరు. మరమ్మతులు విఫలమైతే, విమానాన్ని సైనిక రవాణా విమానం (మిలిటరీ కార్గో ప్లేన్) ద్వారా బ్రిటన్‌కు తిరిగి తీసుకెళ్లే అవకాశం ఉంది.
భారత వైమానిక దళం (IAF) విమానం ల్యాండింగ్ సమయంలో SQUAWK 7700 డిస్ట్రెస్ కోడ్‌కు స్పందించి, ఇంధన భర్తీ , సాంకేతిక సహాయం అందించింది. విమానం భద్రత కోసం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) సిబ్బంది నిరంతరం కాపలా కాస్తున్నారు. క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌లో భాగంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో రొటీన్ ఆపరేషన్‌లో భాగంగా ఈ విమానం ఇటు వైపు వచ్చింది. బ్రిటన్ ఈ సమస్యను పరిష్కరించే వరకు విమానం తిరువనంతపురంలోనే ఉండే అవకాశం ఉంది. భద్రత , చట్టపరమైన అనుమతులు పూర్తయ్యే వరకు టేకాఫ్ లేదా రికవరీ సాధ్యం కాదని అధికార వర్గాలు చెబుతున్నాయి.