Viral News in Telugu: క్రికెట్ ఆడుతూ ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై 13 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. బాల్‌ కోసం వెళ్లి ఎలక్ట్రిక్‌ వైర్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఢిల్లీలోని కోట్లా విహార్ ఫేజ్‌లో ఈ ఘటన జరిగింది. గ్రౌండ్‌లో క్రికెట్ ఆడుతుండగా బాల్ దూరంగా పడిపోయింది. అక్కడే ఓ ఐరన్ పోల్ ఉంది. బాల్ కోసం వెళ్లిన బాలుడు ఆ పోల్‌ని పట్టుకున్నాడు. ఒక్కసారిగా షాక్ తగిలి కుప్ప కూలిపోయాడు. వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్లినా...అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు  చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. గత నెల కూడా ఢిల్లీలో ఇలాంటి ప్రమాదమే జరిగింది. ఓ 12 ఏళ్ల బాలుడు ఎలక్ట్రిక్ వైర్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు. ట్యూషన్‌ నుంచి ఇంటికి వస్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది. అంతకు ముందు ఓ యువకుడు ఇలానే విద్యుదాఘాతానికి గురై చనిపోయాడు. 


అయితే..ఢిల్లీలో వరుసగా ఈ ఘటనలు జరగడంపై మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా మండి పడుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా ఎలక్ట్రిక్ వైర్‌లు ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాయని, ప్రాణాలు తీస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటి వరకూ ఇలా 13 మంది చనిపోయినట్టు చెబుతున్నాయి. మళ్లీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఢిల్లీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ ఇప్పటికే కీలక ప్రకటన చేసింది. విద్యుదాఘాతానికి గురై చనిపోతే రూ.7.5 లక్షల పరిహారం అందించనుంది. షాక్ కారణంగా అంగవైకల్యం కలిగితే వాళ్లకి రూ.5 లక్షల పరిహారం అందిస్తామని వెల్లడించింది.