Bengaluru Water Crisis News: బెంగళూరు వాసులు చుక్క నీటి కోసం పోరాటం చేయాల్సి వస్తోంది. ఎప్పుడూ లేనంతగా నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. ఇంకా వేసవి మొదలు కాకముందే పరిస్థితులు ఇలా ఉంటే...ఇక ఎండాకాలం అంతా తాము ఎలా గడవాలో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల అయితే నెలల పాటుగా నీటి సరఫరా నిలిచిపోయింది. వాటర్ ట్యాంకర్‌లు తెప్పించుకుని వాటితోనే ప్రస్తుతం అవసరాలు తీర్చుకుంటున్నారు. కానీ...ఇలా ఎన్నాళ్లు అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కావేరీ జల వివాదమూ వీళ్లకి ఇబ్బందులు తెచ్చి పెట్టింది. తమిళనాడు, కర్ణాటక మధ్య ఉన్న విభేదాల కారణంగా ఈ సమస్య తలెత్తింది.





"మా ఏరియాలో ఆరు నెలలుగా నీళ్లు రావడం లేదు. కావేరీ నది నీళ్లు వచ్చేలా కనెక్షన్‌లు ఇచ్చారు. వాటి వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఇప్పుడు నీటి సరఫరా ఆగిపోయింది. రూ.2 వేలు పెట్టి మరీ వాటర్ ట్యాంకర్‌లు తెప్పించుకోవాల్సి వస్తోంది. కొనుక్కోవడం తప్ప మాకు ఇంకో దారి కనిపించడం లేదు. ఇక ఎండాకాలం ముదిరితే మరింత సమస్యలు ఎదుర్కోక తప్పదు. పైప్‌లు ఉన్నా నీళ్లే లేకుండా పోయాయి"


- స్థానికుడు


మా ఇంట్లోనూ నీళ్లు లేవు: శివకుమార్


ఈ సమస్యపై కర్ణాటక డిప్యుటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. బెంగళూరు ప్రజలకి త్వరలోనే సరిపడా నీళ్లని సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. చాలా చోట్ల బోర్లు ఎండిపోయాయని, తన ఇంట్లోనూ ఇదే పరిస్థితి ఉందని వివరించారు. ప్రస్తుతం నీటికి చాలా కొరత ఉన్న మాట నిజమే అని...కానీ ఈ సమస్యని తప్పకుండా పరిష్కరిస్తామని వెల్లడించారు. కావేరీ జల వివాదంతో పాటు ఈ సారి వర్షపాతమూ తక్కువగా నమోదైంది. ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటాయి. అందుకే ఈ స్థాయిలో కొరత ఏర్పడింది. కాస్త జాగ్రత్తగా నీటిని వాడుకోవాలంటూ అందరికీ రెసిడెన్షియల్ సొసైటీలు సూచిస్తున్నాయి. ఇదే అదనుగా ప్రైవేట్ ట్యాంకర్ ఓనర్లు ఇష్టమొచ్చినట్టు వసూలు చేస్తున్నారు. 


"కొన్ని ప్రైవేట్ ట్యాంకర్‌లు రూ.600కే ఫుల్ ట్యాంక్‌ని సప్లై చేస్తున్నాయి. మరి కొన్ని రూ.3 వేల వరకూ వసూలు చేస్తున్నాయి. ఈ స్థాయిలో తేడా లేకుండా వాళ్లతో మాట్లాడుతున్నాం. రిజిస్టర్ అయిన వాళ్లే సరఫరా చేసేలా చూస్తున్నాం. ఎంత దూరం వెళ్లి సరఫరా చేస్తున్నాయన్నదానిపైనే డబ్బుల్ని వసూలు చేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం"


- డీకే శివకుమార్, కర్ణాటక డిప్యుటీ సీఎం


Also Read: ఫేస్‌బుక్ ఇన్‌స్టాగ్రామ్‌ సేవలకు అంతరాయం, జుకర్‌బర్గ్‌కి 3 బిలియన్ డాలర్ల నష్టం