మహానాడు రెండో రోజు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు మినీ మేనిఫెస్టో విడుదల చేయడం తెలిసిందే. టీడీపీ మేనిఫెస్టోపై విజయవాడలో మహిళలు హర్షం వ్యక్తం చేశారు. 18 ఏళ్ళు నిండిన మహిళలకు "స్త్రీనిధి" కింద నెలకు 1500 రూపాయలు, 'తల్లికి వందనం'తో ఆ ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే వారికి ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.15000 అందిస్తామని చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టోపై విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం సైతం చేశారు.


టీడీపీ ప్రకటించిన మినీ మేనిఫెస్టోపై వైసీపీ నేతలు, మంత్రులు చేసిన కామెంట్లపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఘాటుగా స్పందించారు. చంద్రబాబు మినీ మేనిఫెస్టో ప్రకటించగానే తాడేపల్లి ప్యాలెస్ లో భూకంపం వచ్చిందన్నారు. తాడేపల్లి పునాదులు కదిలిపోతున్నందున రాష్ట్ర మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని బొండా ఉమ విమర్శించారు.  గతంలో చంద్రబాబు చేసిన సంక్షేమ పథకాలు, ఇప్పుడు జగన్ చేస్తున్న మోసకారి పథకాలపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. రాష్ట్ర మహిళలు చంద్రబాబు సీఎం కావాలని ఆకాంక్షిస్తున్నారని చెప్పారు. సీఎం జగన్ రాక్షసపాలనతో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనన్నారు. కొడాలి నానితో చర్చించేందుకు తాడేపల్లి ప్యాలెస్ కైనా, గుడివాడకైనా వచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే సంక్షేమంపై చర్చించేందుకు ఎక్కడికైనా వస్తామని స్పష్టం చేశారు. వైసీపీ పతనానికి టీడీపీ మినీ మేనిఫెస్టోతో నాంది పలికామన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి దారుణ పరాభవం తప్పదని, ఇకనైనా జగన్ పార్టీ నేతలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.