New IT Rules: కేంద్ర సర్కారు ఐటీ నిబంధనలను సవరించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిబంధనలు మితిమీరి ఉన్నాయని, పూర్తి ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మేరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్- 2021కి సవరణలు చేసింది. ఆన్ లైన్ కంటెంట్ లో నకిలీ, తప్పు సమాచారాన్ని గుర్తించేందుకు గానూ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ను తీసుకువస్తామని కేంద్ర సర్కారు ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ప్రకటించింది. అయితే ఈ నిబంధనలపై పెద్ద ఎత్తున వ్యత్తిరేకత వ్యక్తం అవుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఐటీ నిబంధనల చెల్లుబాటును సవాల్ చేస్తూ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మ్యాగజైన్స్.. బాంబే హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లను తాజాగా విచారించిన బాంబే డివిజన్ బెంచ్.. కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక చీమను చంపేందుకు సుత్తిని వాడలేం కదా.. అంటూ కేంద్ర సర్కారు తీసుకువచ్చిన నిబంధనల తీవ్రతను ఉద్దేశించి స్పందించింది. 


ఈ పిటిషన్ల విచారణ సందర్భంగా.. సోషల్ మీడియాలో నకిలీ సమాచారాన్ని కట్టడి చేసేందుకు తేలికైన మార్గాలు కూడా ఉన్నాయని పేర్కొంటూ పిటిషనర్ల తరఫు న్యాయవాది బెంచ్ ముందు వాదనలు వినిపించారు. దీనిపై కోర్టు స్పందించింది. ఫ్యాక్ట్ చెకింగ్ ఉండాలని, కొంత స్థాయి వరకు సోషల్ మీడియా కంటెంట్ ను ఫ్యాక్ట్ చెక్ చేయాలని వ్యాఖ్యానించింది. అయితే ఈ నిబంధనలు మితిమీరినవి అని పిటిషనర్లు చెప్పిన మాట సరైందే కావొచ్చని పేర్కొంది. ఒక చీమను చంపడానికి సుత్తిని వాడటం ఎంత వరకు సమంజసం అని ఆ నిబంధనల తీవ్రతను కోర్టు ప్రశ్నించింది. 


ఈ ఐటీ నిబంధనలను సవరణ చేయాల్సిన అవసరం ఏమిటో అర్థం కావడం లేదని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అలాగే నకిలీ, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని నిర్ణయించేందుకు ప్రభుత్వంలోని ఒక సంస్థకు పూర్తి స్థాయి అధికారాలను కట్టబెట్టడం కష్టమని పేర్కొంది. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కు ఉంటుందని, దానికి సమాధానం ఇవ్వడం ప్రభుత్వ విధి అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అలాగే ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ను ఎవరు ఫ్యాక్ట్ చేస్తారని కూడా బాంబే హైకోర్టు ప్రశ్నించింది. నకిలీ, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ఎలా నిర్ణయిస్తారనే దానిపై స్పష్టత లేదని చెప్పుకొచ్చింది.