Black Box History | ప్రపంచంలో విమాన ప్రమాదాలు జరిగిన వెంటనే అందరి నోట వినిపించే మాట బ్లాక్ బాక్స్. ప్రమాదానికి కారణాలు తెలుసుకోవాలంటే ఆ విమానంలో పైలట్‌లు బతికి ఉండాలి, లేదా బ్లాక్ బాక్స్ నుండైనా తెలుసుకోవాలి. ఇంతటి ప్రాధాన్యత ఉన్న బ్లాక్ బాక్స్ కథ మీకు తెలుసా? బ్లాక్ బాక్స్ ఓనాడు తిరస్కరణకు గురైన పరికరం అన్న సంగతి మీకు తెలుసా? అయితే ఈ పూర్తి కథనం మీరు చదవాల్సిందే.
బ్లాక్ బాక్స్ ఆవిష్కరణకు కారణం జెట్ విమానాలు
1949లో మొదటి జెట్ ఎయిర్‌లైనర్ కామెట్ను బ్రిటిష్ ఏవియేషన్ సంస్థ డి హావిలాండ్ (De Havilland) ప్రారంభించింది. ఈ జెట్ వేగం, విమానం తీరు, ఆధునిక సౌకర్యాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. అయితే 1952 నుండి వరుసగా రెండేళ్ల పాటు విమాన ప్రమాదాలు చర్చనీయమయ్యాయి. ఈ కాలంలో ఏడు జెట్ విమానాలు కూలిన ఘటనలలో 110 మంది మరణించారు. ఇది ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. కొన్ని విమానాలు ఆకాశంలో అధిక ఎత్తులోనే విచ్ఛిన్నం అయ్యాయి. అసలు ఈ ప్రమాదం ఎందుకు జరిగిందనడానికి కారణాలు తెలియని పరిస్థితి. దీంతో ఈ కామెట్ విమానాల సేవలను నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీని మీద సమగ్ర దర్యాప్తు జరిగింది. చివరికి ఈ ప్రమాదాలు మెటల్ ఫ్యాటిగ్యూ వల్ల అంటే లోహపు అలసట వల్ల జరిగిందని తేలింది. లోహ శాస్త్రం ప్రకారం, ఒక పదార్థం దాని బలం కన్నా ఎక్కువ ఒత్తిడికి గురి చేస్తే అది విచ్ఛిన్నమవుతుంది. దీన్నే లోహపు అలసట లేదా మెటల్ ఫ్యాటిగ్యూ అని పిలుస్తారు. ఈ కామెట్ విమానానికి చెందిన చతురస్రాకార కిటికీలు కారణమని కనుగొన్నారు.
పరిష్కారానికి నూతన అడుగులు
ఇదే సమయంలో ఆస్ట్రేలియాలో కామెట్ ప్రమాదాలపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిపుణుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అందులో మెల్‌బోర్న్‌కు చెందిన ఏరోనాటికల్ రీసెర్చ్ లేబొరేటరీస్ (ARL) లో ఏవియేషన్ ఇంధనాలకు సంబంధించిన 28 ఏళ్ల కెమిస్ట్రీ సైంటిస్ట్ డాక్టర్ డేవిడ్ వారెన్ కూడా పాల్గొన్నారు. కానీ నిపుణుల సమావేశం ఈ కామెట్ విమానాల ప్రమాదాలపై ఎలాంటి ఆధారాలను, పరిష్కారాలను కనుగొనలేకపోయింది. అయితే ఇందుకు కారణం అసలు ప్రమాదం ఎందుకు జరిగిందన్న డేటా లేకపోవడం అన్న విషయం డాక్టర్ డేవిడ్ వారెన్‌కు అర్థమైంది. ప్రమాదానికి గల కారణాలను చెప్పగలిగే పైలట్‌లు చనిపోయారు. కారణం తెలిసి ఉంటే పరిష్కారం కనుక్కోవడం కష్టం కాదన్న అభిప్రాయానికి డాక్టర్ డేవిడ్ వారెన్ వచ్చారు. ఈ ఆలోచనే బ్లాక్ బాక్స్ ఆవిష్కరణకు తొలి అడుగైంది.
ఆలోచనకు పదును పెట్టిన డాక్టర్ డేవిడ్ వారెన్
ఈ సమావేశానికి కొద్దికాలం ముందు డాక్టర్ డేవిడ్ వారెన్ ఓ వాణిజ్య ప్రదర్శనను తిలకించడానికి వెళ్లారు. అందులో ఆయన జర్మన్ రూపొందించిన డిక్టాఫోన్ పరికరం ఆకట్టుకుంది. స్టీల్ వైర్ మీద శబ్దాలను రికార్డ్ చేయగల సామర్థ్యం ఉన్న పరికరం అది. ఇది డాక్టర్ డేవిడ్ వారెన్ ఆలోచనకు మరింత పదునుపెట్టింది. ఆ కాలంలో ఫ్లైట్ డేటా రికార్డర్‌లు కొన్ని సైనిక విమానాల్లో మాత్రమే వాడేవారు. పౌర విమానాల్లో వాడేవారు కాదు. ప్రమాదం జరిగినా ఎలాంటి ఆధారాలు ఉండేవి కావు. డాక్టర్ డేవిడ్ వారెన్ తన పై అధికారికి ఓ లేఖ రాశారు. విమాన ప్రమాదం జరిగినప్పుడు అసలు పైలట్‌లు ఎలాంటి ఆలోచనలతో ఉన్నారు, వారు తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేసే అంశాలు ఫ్లైట్‌లో ఏం జరిగాయి అనే సమాచారాన్ని రికార్డ్ చేయవచ్చని, ప్రమాదంలో నాశనం కాని కంటైనర్‌లో ఫ్లైట్ డేటా రికార్డర్ ఏర్పాటు చేయవచ్చని లేఖలో పేర్కొన్నారు. రానున్న కాలంలో విమానాలు అధిక ఎత్తుకు ఎగురుతాయని, అవి ఎత్తుకు ఎగిరే కొద్ది ప్రమాదాలు పెరుగుతాయని, అలాంటివి జరగకూడదంటే ఆ ప్రమాద కారణాలు తెలుసుకుని, విశ్లేషించాల్సిన అవసరం ఉందని, వాటికి పరిష్కారాలు కనుగొనాల్సి ఉందని లేఖలో వివరించారు. అయితే ఆ లేఖను ఉన్నతాధికారులు పట్టించుకోలేదు.
వ్యక్తిగత ఆసక్తితో పరిశోధన చేసిన డాక్టర్ డేవిడ్ వారెన్
వారెన్ ప్రాజెక్టుకు ఉన్నతాధికారులు ఆమోదముద్ర వేయకపోవడంతో ఆయనే స్వయంగా వీకెండ్స్‌లో తన గ్యారేజ్‌లో పరిశోధన ప్రారంభించారు. తన సొంత ఆలోచనలతో, ఆసక్తితో ఆయన స్వయంగా ప్రోటోటైప్పై పని చేయడం ఆరంభించారు. ప్రోటోటైప్ అంటే ఒక పరికరాన్ని ఉత్పత్తి చేసే ముందు ప్రాథమిక దశలో పరీక్షల కోసం తయారు చేసేదాన్ని ప్రోటోటైప్ అని పిలుస్తారు. బ్లాక్ బాక్స్‌కు ముందు అది చేసే పనితీరును కలిగి ఉన్న డమ్మీ పరికరం అని చెప్పవచ్చు. అయితే 1957లో టామ్ కీబుల్ అనే ఉన్నతాధికారి రావడంతో వారెన్ ఆలోచనలకు ప్రాధాన్యత లభించింది. దీనికి సంబంధించి ఒక డాక్యుమెంట్ తయారు చేయమని ఆయన ఆదేశించారు.
ప్రోటోటైప్ నిర్మాణం కోసం నిధులను సమకూర్చడం జరిగింది. మొదటి ప్రోటోటైప్ నాలుగు గంటల కాక్‌పిట్ శబ్దాలను రికార్డ్ చేయగల సామర్థ్యం కలది. సెకనుకు నాలుగు సార్లు, ఎనిమిది సాధనాల రీడింగ్‌లను రికార్డ్ చేయగలదు. నాణ్యత గల స్టీల్ వైర్‌పై రికార్డ్ చేయడం, విమాన ఇంజిన్‌లతో తనకు తానే స్విచ్ ఆఫ్, స్విచ్ ఆన్ చేయగలగడం, ప్రమాదాలు జరగకపోతే ఆటోమేటిక్‌గా ఆ శబ్దాల రికార్డులు తుడిచివేయడం అంటే ఎరేజ్ చేసుకోవడం వంటి సామర్థ్యం దీనికి ఉంది. ప్రధాన విమానాలన్నింటిలో ఈ పరికరం అమర్చాలని వారెన్ తను రాసిన పత్రంలో పేర్కొన్నాడు. అయితే ఆ తర్వాత ఉన్నతాధికారులు దానిపై ఆసక్తి చూపలేదు. కొత్త ఆవిష్కరణలు చేసే సామర్థ్యం అమెరికా, బ్రిటన్‌లదే అన్న అభిప్రాయం, ఆస్ట్రేలియాలో పెద్దగా విమాన ప్రమాదాలు జరగకపోవడం వల్ల దీన్ని పట్టించుకోలేదు.
ఆస్ట్రేలియాలో తిరస్కరణ - బ్రిటన్‌లో ఆదరణ
ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్త కనుగొన్న ఈ పరికరం ఆ దేశంలో నిరాదరణకు గురైంది. కానీ 1958లో కథ మారింది. ఆ సమయంలో బ్రిటిష్ ఎయిర్ రిజిస్ట్రేషన్ బోర్డు కార్యదర్శి సర్ రాబర్ట్ హార్డింగ్‌హామ్ ఆస్ట్రేలియాలోని ఏరోనాటికల్ రీసెర్చ్ లేబొరేటరీస్‌ను సందర్శించారు. ఆ సమయంలో వారెన్ తన ఫ్లైట్ రికార్డర్‌ను అతనికి చూపించారు. వారెన్ ప్రతిభను, పరికరం పనితీరును గమనించిన హార్డింగ్‌హామ్, దీన్ని బ్రిటన్‌కు తీసుకురావాలని కోరారు. వారెన్ నెల పాటు బ్రిటన్‌లో ఉండి ఆ పరికరం మీద బ్రిటీష్ ఎయిర్‌వేస్ అధికారులకు చూపించారు. వారిని ఇది ఎంతో ఆకట్టుకుంది. ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చాక ఆస్ట్రేలియా ఏరోనాటికల్ రీసెర్చ్ సెంటర్ వారెన్ పరికరంపై శ్రద్ధ పెట్టి ఆయనకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఒక బృందాన్ని ఆయనకు కేటాయించి దీనిపై పని చేయమని కోరింది. ఇలా ఫ్లైట్ వాయిస్ రికార్డర్ అభివృద్ధి చేయబడింది. ఇదంతా 1962 నాటికి పూర్తయింది. ఈ ఆధునిక పరికరంలో సెకనుకు 24 రీడింగ్స్‌ను రికార్డ్ చేయగలిగేలా తీర్చిదిద్దారు. ప్రమాదం జరిగితే పాడవకుండా లేదా నాశనం అవకుండా ఉండేందుకు గాను ఫైర్‌ప్రూఫ్‌గా, షాక్‌ప్రూఫ్‌గా తయారు చేయబడింది. అదే నేటి బ్లాక్ బాక్స్.
విమానయాన చరిత్రలో బ్లాక్ బాక్స్ అద్భుత ఆవిష్కరణ
ప్రతీ రోజు ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల విమానాలు ఆకాశంలో తిరుగుతుంటాయి. లక్షలాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుతుంటారు. ఇలా విమానాల్లో భద్రత పెంచడానికి కారణం బ్లాక్ బాక్స్ అనే చెప్పాలి. ఇప్పటి వరకు జరిగిన ప్రతీ ప్రమాదం, దానికి గల కారణాలను అన్వేషించడానికి ఈ బ్లాక్స్ కీలకమైన సమాచారాన్ని ఇవ్వగలిగింది. ఆ సమాచారంతోనే ఎప్పటికప్పుడు విమానయాన సంస్థలు నిర్మాణ దశలోనే ఆ ప్రమాదాలను నివారించగలుగుతాయి. ఇందుకు కారణం ఆస్ట్రేలియన్ సైంటిస్ట్ డాక్టర్ డేవిడ్ వారెన్. ఇతను 2010లో మరణించారు. ఆయన విమానయాన సేవలకు గాను ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియాగా నియమించబడ్డారు. విమానం ఎక్కే ప్రతీ ఒక్కరూ వారెన్‌ను గుర్తుంచుకోవాల్సినంత గొప్ప ఆవిష్కర్త అయ్యారు.