Ahmedabad Plane Crash: ఆలస్యం అమృతం అవొచ్చు విషయం అవొచ్చు..కానీ అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాద ఘటనలో మాత్రం ఓ యువతికి ఆలస్యం అమృతమే అయింది. పది నిముషాలు ఆలస్యం అయ్యాను ఫ్లైట్ మిస్సయ్యానని బాధపడింది..కానీ మిస్సైన బాధ నుంచి బయటకు రాకముందే జరిగిన దుర్ఘటన ఆమెను పెద్ద షాక్ కి గురిచేసింది. అసలేం జరిగిందంటే..

అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటన ఎన్నో కుటుంబాల్లో తీరని వేదన మిగిల్చింది. ఈ దుర్ఘటనలో ఎన్నో కుటుంబాల్లో తీరని వేదన మిగిల్చింది. విమానం ఎక్కే ముందు సెల్ఫీ వీడియోలు తీసుకున్నవారు కొందరు, విమానంలో సెల్ఫీలతో సందడి చేసినవారు మరికొందరు. అందరి ఆనందం క్షణాల్లో మాడి మసైపోయింది. అయితే ఇదే విమానంలో ప్రయాణం చేయాల్సి మిస్సైంది ఓ యువతి. కేవలం 10 నిముషాలు ఆలస్యం ఆమె ప్రాణాలు కాపాడింది.

ఆమె పేరు భూమి చౌహాన్. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లేందుకు ఎయిర్ ఇండియా టికెట్ బుక్ చేసుకున్నారు. ఎయిర్ పోర్ట్ కి చేరుకునే క్రమంలో ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారు. ఫ్లైట్ మిస్సవుతానేమో అని టెన్షన్ పడ్డారు. ఎలాగైనా చేరుకోవాలని తపన పడ్డారు. అనుకోకుండా జరిగిన ఆలస్యానికి ఫ్లైట్ మిస్సైంది. తాను ఎయిర్ పోర్టులో అడుగుపెట్టేసరికే ఫ్లైట్ టేకాఫ్ అయిపోయింది. పక్కనున్న ఊరికి వెళ్లే బస్సేం కాదుకదా మరో బస్కెక్కి వెళ్లొచ్చులే అనుకోవడానికి..పోనీ సమీపంలో ఉండే మరో ప్రదేశం అయితే ప్రయాణానికి వెంటనే ఆప్షన్ చూసుకునేదేమో. అందుకే ఫ్లైట్ మిస్సవడంతో ఎయిర్ పోర్టులోనే ఆవేదనగా కూర్చుండిపోయారామె.

ఫ్లైట్  మిస్సయ్యానని ఆవేదన చెందారు కానీ ఆ తర్వాత కొద్దిసేపటికే ఒళ్ళు గగొర్పొడిచే సంఘటన తెలిసి అసలేం జరిగిందో ఆమెకు అర్థంకాలేదు. అప్పటివరకూ ఫ్లైట్ మిస్సయ్యాననే ఉన్న బాధ మొత్తం పోయి..తనను ట్రాఫిక్ బతికించేంసిందనే ఆశ్చర్యం..దుర్ఘటన జరగడంపై షాక్ లో ఉండిపోయారు. ఈ సంఘటనకు సంబంధించి ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. నేను వెళ్లాల్సిన విమానం ప్రమాదానికి గురైందని తెలియగానే షాక్ కి గురయ్యా. ఆ ఘటన తల్చుకుంటే నా శరీరం  వణికిపోతోంది.. మాట్లాడలేకపోతున్నా.. మైండ్ బ్లాంక్ అయిపోయింది..ఆ దేవుడికి ధన్యావాదాలు నా గణపతి బప్పా నన్ను కాపాడాడు అంటూ భూమి చౌహన్ పోస్టులో రాసుకొచ్చారు. కేవలం పది నిముషాలు ఆలస్యం కావడంతో ఫ్లైట్ మిస్సయ్యానని పేర్కొన్నారామె.

లండన్ లో భర్తతో కలసి ఉంటున్నారు భూమి చౌహాన్. రెండేళ్ల తర్వాత వెకేషన్ కోసం ఆమె ఇండియాకు వచ్చారు. తిరిగి వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఫ్లైట్ మిస్సవడంతో అతి భయంకరమైన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. 

ట్రాఫిక్ జామ్ ప్రాణాలు కాపాడింది, ఆలస్యమై ప్లైట్ మిస్సవడంతో ఆ క్షణం అయ్యో అనిపించినా.. బతికినన్ని రోజులు ఆ దేవుడే కాపాడాడు అనిపించేలాంటి ఈ సంఘటన ఎప్పటికీ గుర్తుండిపోతుందంటారు భూమి చౌహాన్. అందుకే ఎవరి విషయంలో ఆలస్యం విషం అయినా కానీ భూమి విషయంలో అమృతమే అయింది.