Jamili elections: వన్ నేషన్ - వన్ ఎలక్షన్ విధానం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ కూటమికి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు బాగా కలసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలో ఫలితాలు వేరేగా వచ్చి ఉంటే ఎన్డీఏ కూటమి కొంత బలహీనంగా కనిపించేది. ఏ నిర్ణయం తీసుకోవాలన్న ఒకటికి పది సార్లు ఆలోచించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. ధైర్యంగా ముందడుగు వేయడానికి అవసరమైన నైతిక బలం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల విజయం ఇచ్చిందని అనుకోవచ్చు.
వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యాంగ సవరణలు
వన్ నేషన్ - వన్ ఎలక్షన్ కోసం కేంద్రం ఇప్పటికే దాదాపుగా అన్ని లాంఛనాలు పూర్తి చేసింది. బిల్లును పార్లమెంట్ లో పెట్టి ఆమోదించడమే మిగిలింది. అయితే ఇందు కోసం కనీసం ఎనిమిది రాజ్యాంగసవరణలు చేయాలని నిపుణులు సిఫారసు చేసినట్లుగా తెలుస్తోంది. రాజ్యాంగసవరణ జరగాలంటే రెండు సభల్లోనూ మూడింట రెండు వంతుల మెజార్టీ అవసరం. విడివిడిగా సభలు నిర్వహిస్తే మూడింట రెండు వంతుల మెజార్టీ కష్టం అందుకే ఉభయసభల సంయుక్త సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. అంటే త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లోనే జమిలీ ఎన్నికలకు అవసరమైన రాజ్యాంగసవరణలు పూర్తిచేసే అవకాశం ఉంది.
Also Read: ఆసలైన శివసేన, ఎన్సీపీలు ఏవో తేల్చేసిన మహారాష్ట్ర ప్రజలు - ఇక థాక్రే, పవార్‌లకు రాజకీయ సన్యాసమేనా ?
మెజార్టీ పార్టీలు అనుకూలం
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజార్టీ రాకపోవడం మిత్రపక్షాల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతూండటంతో వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై బీజేపీ వెనక్కి తగ్గుతుందని అనుకున్నారు. కానీ ఈ విషయంలో వారి ప్లాన్ల్లు వారిక ిఉన్నాయని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల కారణంగా మరిన్ని ప్రాంతీయ పార్టీలు బీజేపీకి అనుకూలంగా మారే అవకాశం ఉంది. జమిలీ ఎన్నికలకు మెజార్టీ పార్టీలు అనుకూలంగా ఉన్నాయి.అయితే కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉంది. ముందే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటే మరిన్ని పార్టీలు అంగీకారం తెలిపే అవకాశం ఉంది.
Also Read: మహారాష్ట్ర సీఎంగా దేవేందర్ ఫడ్నవీస్ -బీజేపీ సునామీతో మారిపోనున్న లెక్కలు!
ప్రభుత్వాలపై ప్రజా వ్యతిరేకత ఉన్నా అందుకోలేకపోతున్న కాంగ్రెస్ కూటమి
హర్యానాలో ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని సర్వేలు చెప్పాయి. అయినా కాంగ్రెస్ విజయం సాధించలేదు. మహారాష్ట్రలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కూటమికి పెద్దగా సీట్లు రాలేదు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆ కూటమి స్వీప్ చేసింది. అంటే కాంగ్రె్స కూటమి ప్రభుత్వాలపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మల్చుకోవడంలో విఫలమవుతోంది. బీజేపీకి అదే ప్లస్ పాయింట్ గా మారుతోంది. పార్లమెంట్ లోనూ కాంగ్రెస్ నాయకత్వంలో పని చేసేందుకు మిత్రపార్టీలు కూడా వెనుకడుగు వేసే అవకాశం ఉంది.